నిత్యాన్నదాన నిర్ణయంతో కళ్లు చెమర్చాయి

ABN , First Publish Date - 2020-06-16T09:55:18+05:30 IST

‘మండు వేసవిలో.. అసెంబ్లీ ఆవరణలో మీరు పోసిన అంబలి తాగినప్పుడు కడుపులో చల్లదనం నిండినట్లే, మీ నిత్యాన్నదాన మహా

నిత్యాన్నదాన నిర్ణయంతో కళ్లు చెమర్చాయి

  • కోనప్ప ప్రయత్నానికి ఎల్లప్పుడూ సహకరిస్తా
  • టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు మంత్రి హరీశ్‌ ప్రశంస
  • ‘ఆంధ్రజ్యోతి నవ్య’లో ప్రచురితమైన కథనం ట్వీట్‌


హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ‘మండు వేసవిలో.. అసెంబ్లీ ఆవరణలో మీరు పోసిన అంబలి తాగినప్పుడు కడుపులో చల్లదనం నిండినట్లే, మీ నిత్యాన్నదాన మహా నిర్ణయం గురించి చదివి నా కళ్లు చెమర్చాయి’ అంటూ సిర్పూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు కురిపించారు. సొంత ఖర్చుతో రోజూ వెయ్యిమందికి అన్నం పెట్టే ఆలోచన ఎంతో ఉదాత్తమైనదని హరీశ్‌ కొనియాడారు. ‘ఇంత గొప్ప కార్యం తలపెట్టిన మీకు, మద్దతుగా నిలిచిన మీ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ ప్రయత్నానికి ఎల్లవేళలా సహకారం అందించడానికి సిద్థంగా ఉన్నా’ అని మంత్రి ట్వీట్‌ చేశారు.


‘రోజూ వెయ్యి మందికి అన్నం పెడుతున్నాడు!’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి నవ్య’లో సోమవారం ప్రచురితమైన కథనాన్ని హరీశ్‌ ప్రస్తావించారు. కోనప్ప ప్రయత్నం రాజకీయాలు, నాయకుల పట్ల ప్రజల్లో గౌరవం పెంచేలా ఉందన్నారు. అన్నదానం అత్యంత మానవీయమైనదని.. అది నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆస్తులను విక్రయించి నిధులు సమకూర్చాలనే దాతృత్వం తనలో స్ఫూర్తిని నింపిందని చెప్పారు.

Updated Date - 2020-06-16T09:55:18+05:30 IST