అప్పులు ఇచ్చేందుకు షరతులా?
ABN , First Publish Date - 2020-05-19T09:45:34+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కరోనా సహాయ చర్యల కోసం రూపాయి ఇవ్వని కేంద్ర ప్రభుత్వం.. అప్పులు ఇచ్చేందుకు షరతులు విధించడం

- కరోనా సాయం ఇవ్వని కేంద్రం: హరీశ్
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి), మే 18: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కరోనా సహాయ చర్యల కోసం రూపాయి ఇవ్వని కేంద్ర ప్రభుత్వం.. అప్పులు ఇచ్చేందుకు షరతులు విధించడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ఉదారంగా సాయం చేయాల్సిన కేంద్రం కేవలం 5 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం శివారులోని పోతిరెడ్డిపల్లిలో సోమవారం జానపద కళాకారులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కార్యక్రమంలో, సంగారెడ్డి కలెక్టరేట్‌లో పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమైన సందర్భంగా మంత్రి మాట్లాడారు.
పరిశ్రమలలో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశ్రమల యజమానులను, సంబంధిత అధికారులను ఆదేశించారు. అనుమతించిన పరిశ్రమలు ప్రారంభించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. పాత పద్ధతిలో పరిశ్రమలు నడుపుతామంటే కుదరదన్నారు. కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, షిఫ్టు పద్ధతిలో కార్మికులతో పని చేయించాలన్నారు. కార్మికులకు మాస్క్‌లు, శానిటైజర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు. సమీక్షలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.