కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ మంత్రి హరీష్‌రావు

ABN , First Publish Date - 2020-06-23T19:18:37+05:30 IST

కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ మంత్రి హరీష్‌రావు

కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ మంత్రి హరీష్‌రావు

సంగారెడ్డి: టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరుతున్నారన్నారు. దేశం మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసిస్తోందన్నారు. తెలంగాణ కోసం పోరాడి సాధించిన ఉద్యమ నేత సీఎం కావడం ప్రజల అదృష్టమని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో బంగారు తెలంగాణకు ఫలమైన పునాధులు పడుతున్నాయని తెలిపారు. ఆసరా పింఛన్లు, రైతు రుణమాఫీ, రైతు బంధు, ఉచిత కరెంటు ఇచ్చిన సర్కారు టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌తో రేషన్ కార్డు ఉన్న వారందరికీ రూ.15 వందల నగదు,  బియ్యం ఇచ్చింది ఒక్క కేసీఆరే అని అన్నారు.


కేసీఆర్ బాగా పని చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారన్నారు. ఇండియా - చైనా యుద్ధంలో మరణించిన సంతోష్ బాబు కుటుంబాన్ని ఐదు కోట్లు ఇచ్చి ఆదుకున్నారన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకు ప్రభుత్వం చేసే మంచి కనిపించదని మండిపడ్డారు. ఢిల్లీ కాంగ్రెస్ మెచ్చుకుంటే.. లోకల్ కాంగ్రెస్ వాళ్లు తిడుతున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రెప్పపాటు కూడా కరెంట్ పోవడం లేదన్నారు. ఇవాళ దేశానికి తెలంగాణ మోడల్‌గా నిలిచిందని... దీన్ని చూసి స్థానిక కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. తాము ప్రాజెక్టులు కడితే కాంగ్రెస్ నేతలు కన్నీళ్ళు కారుస్తున్నారన్నారు.


టీఆర్ఎస్ ప్రజల హృదయాల్లో ఉన్న పనులే చేస్తుందని తెలిపారు. ప్రజలే తమకు హైకమాండ్ అన్నారు. కరోనా కంట్రోల్ అయ్యాక సంగారెడ్డిలో గల్లీ, గల్లీలోనూ తిరుగుతానని మంత్రి తెలిపారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్వాసం పోతుందన్నారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలోని నాల్సాబ్ గడ్డలో ఒక రోజంతా ఉంటానని.. అన్ని సమస్యలకు పరిష్కారిస్తానని తెలిపారు. స్వీయ నియంత్రణతోనే కరోనాను ఎదుర్కోవాలని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలందరు ప్రజలకు సేవ చేయాలని...ధైర్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. 

Read more