కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వంతో పాటు మహిళలూ మేము సైతం అంటూ

ABN , First Publish Date - 2020-04-08T22:20:42+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మేము సైతం అంటూ ఆయా గ్రామాల మహిళలు ముందుకు రావడం సంతోషాన్నిస్తోందని ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వంతో పాటు మహిళలూ మేము సైతం అంటూ

చిన్నకోడూరు: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మేము సైతం అంటూ ఆయా గ్రామాల మహిళలు ముందుకు రావడం సంతోషాన్నిస్తోందని ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చిన్నకోడూరు మండలంలోని మైలారం, గోనెపల్లి, ఇబ్రహీంనగర్‌ గ్రామాలకు చెందిన గ్రామ మహిళా సమాఖ్య సంఘ మహిళా ప్రతినిధులను మంత్రి హరీశ్‌రావు అభినందించారు. తమ వంతు సాయంగా సీఎం సహాయ నిధికి విరాళంగా 10వేల రూపాయల చెక్కును మహిళలు మంత్రి అందజేశారు. బుధవారం మంత్రి హరీశ్‌రావు ఆయా గ్రామాల్లో పర్యటించారు. పలు గ్రామాల్లో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీఛైర్మన్‌ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 14 కోట్ల గన్నీబ్యాగులు అవసరం అవుతాయని ప్రస్తుతం రాష్ట్రంలో 5కోట్లన్నర గన్నీబ్యాగులే ఉన్నాయన్నారు. మిగిలిన సగం బ్యాగుల కోసం పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి , ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారని, వాటిని తెప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. 


రైతులు కూడా గతంలోని పాత గన్నీబ్యాగులు ఉంటే తీసుకు రావాలని కోరారు. ఏప్రిల్‌ నెలలో అకాల వర్షాలు, వడగండ్ల వానవచ్చే అవకాశం ఉందని, రైతులు టార్పాలిన్‌ కవర్లు వెంట తెచ్చుకోవాలని విజ్ఞప్తిచేశారు. టార్పాలిన్‌ కవర్లు లేకపోతే రైతుకు మరో రైతు ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. పల్లె పల్లెలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి మీ వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని, పంట కోసిన తరువాత బాగా ఆరబెట్టిన తర్వాత మీకు ఇచ్చిన టోకెన్‌ నెంబర్‌ ప్రకారం కొనుగోలు కేం ద్రాలకు తీసుకురావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో మన దేశంలో కరోనా అదుపులో ఉందన్నారు. కరోనాకు మందులేదు. మన ఇంట్లో మనం ఉంటూ ప్రభుత్వానికి సహకరించడమే కరోనాకు ముందు అన్నారు. 

Updated Date - 2020-04-08T22:20:42+05:30 IST