తెలంగాణ ఉద్యమానికి దుబ్బాక అడ్డా
ABN , First Publish Date - 2020-10-21T08:37:30+05:30 IST
తెలంగాణ ఉద్యమానికి దుబ్బాక అడ్డా అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

ప్రతీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎ్‌సదే విజయం..
బీజేపీ పెద్ద వకీలు రెండేళ్లయినా..
ముంపు గ్రామాల ముఖం చూడలే
కాంగ్రె్‌సది గోబెల్స్ ప్రచారం: హరీశ్
తొగుట, అక్టోబరు 20 : తెలంగాణ ఉద్యమానికి దుబ్బాక అడ్డా అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా తొగుటలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో మంత్రి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు ఉప ఎన్నికలు జరిగాయని, అన్నింట్లో 50 వేల మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించిందన్నారు. నాలుగో ఉపఎన్నిక దుబ్బాకలో డబుల్ మెజారిటీతో గెలువబోతున్నామని జోస్యం చెప్పారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులకు ఏదో చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీకి చెందిన పెద్ద వకీలు రెండేళ్లయినా ముంపు గ్రామాల ముఖం చూడలేదని విమర్శించారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు ఆలస్యం అవడానికి కారణం కాంగ్రెస్ వాళ్లు కేసులు వేయడమేనని మండిపడ్డారు. కొండపోచమ్మ, రంగనాయకసాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన విధంగా మల్లన్నసాగర్ బాధితులకు కూడా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు కరెంటు ఇవ్వక మోసం చేసినందుకా? లేక కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని కోర్టులో కేసులు వేసినందుకా? కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు ఓట్లు అడుగుతారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ వాళ్లు గెలిచి ఏమి చేశారని ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారని.. ఓట్ల కోసం కేసీఆర్ అక్కడికి వెళ్లకపోయినా, గెలిచిన అనంతరం రూ.300 కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేశారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలు చెబుతుందని, కాంగ్రెస్ పార్టీలా గోబెల్స్ ప్రచారం చేయదని చెప్పారు. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ఇప్పటికే అసెంబ్లీలో లక్ష ఇళ్లు మంజూరు చేశామన్నారు. దుబ్బాకను అన్ని విధాలా అభివృద్ధి చేసింది రామలింగారెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటికే మల్లన్నసాగర్ ముంపు గ్రామాలైన పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు టీఆర్‌ఎ్‌సలో చేరారని వెల్లడించారు. ముంపు గ్రామాల ప్రజలకు న్యాయంగా రావాల్సిన ప్రతి రూపాయి వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
హరీశ్ వాహనం సైతం తనిఖీ
సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట వాగుగడ్డ చౌరస్తాలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వాహనాలను మంగళవారం పోలీసులు తనిఖీ చేశారు.