ఐసీఎంఆర్ చెప్పినట్లే చేస్తున్నాం
ABN , First Publish Date - 2020-05-17T08:38:26+05:30 IST
‘కోవిడ్-19 మరణాల విషయంలోనూ భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర జబ్బులున్న....

నిబంధనల మేరకే కరోనా మరణాల లెక్కలు
పాజిటివ్ ఉన్న వ్యక్తులకు 10 రోజుల చికిత్స
తర్వాత 7 రోజుల హోం ఐసొలేషన్: ఈటల
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): ‘కోవిడ్-19 మరణాల విషయంలోనూ భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర జబ్బులున్న వారు కరోనా సోకి మరణించినట్లయితే.. అటువంటి వారిని దీర్ఘ కాలిక వ్యాధులతో చనిపోయినట్టుగానే పరిగణించాలి’’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఐసీఎంఆర్ చెప్పినట్లుగానే రోగులకు చికిత్స అందిస్తున్నామని, కరోనా మరణాల ప్రకటన, రోగుల డిశ్చార్జి, హోమ్ ఐసోలేషన్ నిబంధనలను అమలు చేస్తున్నామని తెలిపారు. శనివారం బీఆర్కే భవన్‌లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న రోగులు మరణించడానికి గల కారణాలను విశ్లేషించడానికి ప్రొఫెసర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే మరణాల లెక్కలను ప్రకటించాలని ఐసీఎంఆర్ తెలిపిందని చెప్పారు. పాజిటివ్ ఉన్న వ్యక్తులకు 10 రోజుల పాటు చికిత్స అందించిన తరువాత.. ఎలాంటి పరీక్షలు చేయకుండానే డిశ్చార్జి చేయవచ్చని పేర్కొన్నారు. డిశ్చార్జి అయిన వారిని 7 రోజుల పాటు హోమ్ ఐసొలేషన్‌లో ఉంచాలన్నారు. ఒకవేళ కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్న, ఇతర ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను మాత్రం ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిచాలని ఐసీఎంఆర్ నిర్దేశించిందని మంత్రి తెలిపారు. ప్రైమరీ, సెకండరీ పాజిటివ్‌తో కాంటాక్టు అయిన వ్యక్తులకు కరోనా లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలన్నారు. ఇంట్లోని ఒక ప్రత్యేక గదిలో ఉంచాలని, వారికి సహాయం కోసం ఒక వ్యక్తి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, సహాయకుడికి హైడ్రాక్సీక్లోరోక్విన్ గోళీలను అందించాలని సూచించారు. 17 రోజుల పాటు రోగులను పర్యవేక్షణలో ఉంచాలని చెప్పారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారికి అవసరం అయిన నిత్యావసరవస్తువులన్నింటిని జీహెచ్‌ఎంసీ ద్వారా అందిస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్ సోకడంవల్ల ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని ఆయన తెలిపారు.