నిమ్స్‌లో మాలిక్యూలర్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి ఈటల

ABN , First Publish Date - 2020-09-26T00:46:44+05:30 IST

కరోన వైరస్‌ ప్రజలందరినీ ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు ప్రభుత్వాలను సైతం ఆరోగ్యం విషయంలో మన స్థాయి ఏంటో తెలియజేసిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

నిమ్స్‌లో మాలిక్యూలర్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి ఈటల

హైదరాబాద్‌: కరోన వైరస్‌ ప్రజలందరినీ ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు ప్రభుత్వాలను సైతం ఆరోగ్యం విషయంలో మన స్థాయి ఏంటో తెలియజేసిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరోనా కారణంగా ప్రభుత్వాలు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టేలా చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నివేల కోట్లయినా సరే ఖర్చుచేసి ప్రజలకు మరింత నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందించేలా వైద్య పరికాలు, మౌలిక సవసతులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల న్నింటిలో సకల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని తెలిపారు. నిమ్స్‌ ఆస్పత్రిలో మాలిక్యూలర్‌ ల్యాబ్‌ను శుక్రవారం మంత్రి ఈటల ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, శానిటేషన్‌ సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. 


నిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌అని, ఇక్కడ మూత్రపిండాలు, లివర్‌, గుండెమార్పిడి చేయడానికి పరీక్షలు అవసరం అవుతాయి. అవన్నీ చేయడానికి 6 కోట్లతో మాలిక్యూలర్‌ డయాగ్నాస్టిక్‌ సెంటర్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. దీంతో కిడ్నీ, లివర్‌, హార్ట్‌, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయడానికి అవసరమైన పరీక్షలన్నీ ఈ ల్యాబ్‌లో చేయడానికి వీలవుతుందన్నారు. వీటితోపాటు కరోనా పరీక్షలు చేయడానికి దక్షణభారత దేశంలో మొదటి సారిగా ఏర్పాటుచేసిన కోబాస్‌ మిషన్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. 


రోజుకు నాలుగు వేల కరోనా పరీక్షలు చేయగల సామర్ధ్యం ఇక్కడ ఉందన్నారు. ఒకేసారి హెచ్‌ఐవి, టీబీ, కరోనా మూడింటికీ సంబంధించిన పరీక్షలు ఈ మిషన్‌ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సత్యనారాయణ, డా. గంగాధర్‌తోపాటు పలువురు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-26T00:46:44+05:30 IST