ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ కేంద్రం ప్రకటనపై కెటిఆర్ ట్వీట్
ABN , First Publish Date - 2020-09-19T00:37:20+05:30 IST
మిషన్ భగీరథ అమలుతో తెలంగాణ ప్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఆవిర్భవించినట్లుగా ట్వీట్ చేసిన ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ కి రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ (మిషన్ భగీరథ) మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్: మిషన్ భగీరథ అమలుతో తెలంగాణ ప్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఆవిర్భవించినట్లుగా ట్వీట్ చేసిన ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ కి రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ (మిషన్ భగీరథ) మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ పథకం దేశంలోనే నెంబర్ వన్ పథకంగా నూటిని నూరు శాతం విజయవంతం అవడానికి ఆ పథకం రూపకర్త సీఎం కెసిఆర్, అప్పట్లో ఆ శాఖను నిర్వహించిన కెటిఆర్ ల కృషే కారణమని ఆయన అన్నారు. తాజాగా, మిషన్ భగీరథ పథకం వల్ల ఫ్లోరైడ్ రహితంగా తెలంగాణ ఆవిర్భవించినట్లు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్టంలో 967 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలుండేవన్నారు. ఇందులో అత్యధిక భాగం నల్లగొండ, నల్లగొండ సరిహద్దుగా ఉన్న జనగామ జిల్లా తదితర ప్రాంతాల్లో అధికంగా ఉండేవన్నారు. ఎప్పుడో 30 ఏళ్ళ కింద, సింగూరు జలాలను సిద్దిపేటకు అందించిన అనుభవంతో, సిఎం అయిన వెంటనే కెసిఆర్, మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించారన్నారు. ఆ పథకాన్ని మొదట నిర్వహించిన మంత్రి కెటిఆర్ అని ఎర్రబెల్లి చెప్పారు. కాల క్రమంలో ఈ సంఖ్య జీరోకి చేరిందన్నారు.
తెలంగాణ వచ్చే నాటికి కేవలం 5,767 గ్రామాలకు మాత్రమే తాగునీటి సదుపాయం ఉండేదని, మిగతా 19,372 ఆవాసాలకు అసలు నీటి సదుపాయమే లేదన్నారు. నీటి వసతి ఉన్న ఆవాసాల్లోనూ 365 రోజల పాటు నీరందేది కాదని, మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు.
తెలంగాణ వచ్చాక సీఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించి అమలు చేయడం మొదలు పెట్టాక పరిస్థితి మొత్తం మారిపోయిందన్నారు. ఇప్పుడు తెలంగాణలో 23,968 ఆవాసాలకు, 120 పట్టణ ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందుతోందని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. 53.46శాతం నల్లాల ద్వారా మంచినీరు ఇంటింటికీ సిరిపోయేంతగా చేరుతోందని మంత్రి చెప్పారు.