ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలి
ABN , First Publish Date - 2020-10-01T21:08:58+05:30 IST
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సిన వెయ్యి కోట్ల నిధులను వెంటనే ఇవ్వాలని, అలాగే, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ తీర్మానించింది.
హైదరాబాద్: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సిన వెయ్యి కోట్ల నిధులను వెంటనే ఇవ్వాలని, అలాగే, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ తీర్మానించింది. 5వ తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్ లోని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, దేశంలో, ఉపాధి హామీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పని దినాలను, నిరుపేదలకు ఉపాధిని కల్పించలిగామన్నారు. ప్రత్యేకించి కరోనా వైరస్ విస్తరణ, లాక్ డౌన్ సమయంలో కేవలం 15 రోజుల్లోనే 25లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇది జాతీయ రికార్డు అన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా ఉపాధి కల్పనతోపాటు, నిరుపేదల ఆర్థిక స్థాయిని కూడా పెంచగలిగామని తెలిపారు. తెలంగాణలో 29.23 కుటుంబాలకు ఉపాధిని కల్పించామని, ఇది దేశంలోనే రికార్డు అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఏడాది 3వేల కోట్ల రూపాయల పనులు తెలంగాణ రాష్ట్రంలో జరిగాయన్నారు.
గతంలో ఉపాధి హామీ పనులంటే అంతగా అభివృద్ధి కనిపించేది కాదన్నారు. నర్సరీలు, మొక్కల పెంపకం, చెరువుల పూడికతీత, ఇంకుడుగుంతలు, సిసి రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, వైకుంఠ దామాలు, ప్రకృతి వనాలు, డంపు యార్డులు, కల్లాలు, రైతు వేదికలు వంటి వెన్నో నిర్మిస్తున్నామని చెప్పారు. నిర్ణీత కాలానికి ముందే ఉపాధి హామీ పనులన్నీ పూర్తి చేసి, కొత్తగా మరిన్నినిధుల కోసం నిధులను కేంద్రాన్ని అడిగిన రాష్ట్రం కూడా మనదేనన్నారు. నిర్ణీత లక్ష్యాలకనుగుణంగా పని చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఉపాధి హామీ అధికారులు అందరినీ మంత్రి అభినందించారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, కమిట్ మెంట్ తో పని జరుగుతున్నది. గ్రామాల్లో పచ్చదనం పరుచుకుంటున్నది. సీజనల్ వ్యాధులు తగ్గాయి. గ్రామ పంచాయతీలకు క్రమం తప్పకుండా ప్రతి నెలా రూ.308 కోట్లు విడుదల చేస్తుండటంతో పనులు జరుగుతున్నాయి. పల్లెప్రకృతి వనాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు మరిన్ని నిధులు అందేలా చూడండని అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు అద్భుతంగా సాగుతున్నాయి. గ్రామాల రూపురేఖలు మారాయి. సమర్థవంతంగా పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ నుంచి గిరిజన సంక్షేమానికి రావాల్సిన నిధులను క్రమం తప్పకుండా అందించాలని కోరారు.