యాదాద్రిలో ఎర్రబెల్లి వాహన పూజ

ABN , First Publish Date - 2020-07-05T07:07:11+05:30 IST

యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వాహనానికి పూజలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.

యాదాద్రిలో ఎర్రబెల్లి వాహన పూజ

  • ఆంక్షలున్నా పట్టించుకోని అధికారులు

యాదాద్రి, జూలై 4(ఆంధ్రజ్యోతి): యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వాహనానికి పూజలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. కరోనా ఆంక్షలను పక్కన బెట్టి మంత్రి వాహనానికి పూజలు నిర్వహించడం విమర్శలకు దారితీయడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా వాహన పూజలను ప్రారంభిస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. కరోనా లాక్‌డౌన్‌ అనంతరం ప్రభుత్వం పలు ఆంక్షల నడుమ ఆలయాల్లో దర్శనాలను ప్రారంభించింది. స్వామివారి కల్యాణం, హోమ పూజలు, జోడిసేవలు, అభిషేకం, అర్చనల వంటి ఆర్జిత సేవలతోపాటు వాహన పూజలపై ఆంక్షలు విధించింది.


అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త వాహనానికి ఆలయ వాహన పూజల షెడ్డులో మంత్రి సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిపై విమర్శలు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. శనివారం నుంచి వాహన పూజలకు దేవాదాయ శాఖ కమిషనర్‌ అనుమతి ఇచ్చారని, ఈమేరకు పూజలు ప్రారంభించినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి ప్రకటించారు. 

Updated Date - 2020-07-05T07:07:11+05:30 IST