ఈ నెల 8న రైతుల బంద్ కు సంపూర్ణ మద్దతు:ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-12-07T21:03:03+05:30 IST
రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడినట్లు చరిత్రలో లేదు. తెలంగాణలో సీఎం కె సిఆర్ దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేస్తుంటే

హైదరాబాద్: రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడినట్లు చరిత్రలో లేదు. తెలంగాణలో సీఎం కె సిఆర్ దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేస్తుంటే... దేశంలో పీఎం మోడీ పండుగలాంటి వ్యవసాయాన్ని దండుగ చేసే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇందుకు నిరసనగా దేశ వ్యాప్తంగా 12 రోజులుగా రైతులు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయక దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా నిలవాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు.
పార్టీ నిర్ణయం, సీఎం కెసిఆర్ ఆదేశానుసారం, కేంద్ర మొండి వైఖరికి నిరసనగా దేశ వ్యాప్తంగా ఈ నెల 8న యావత్ రైతాంగం నిర్వహిస్తున్న బంద్ కు టిఆర్ఎస్ తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని తెలిపారు. బంద్ లో ప్రత్యక్షంగా పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. ఆ రోజు బంద్ కు రాష్ట్ర, దేశ ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, దేశానికి అన్నం పెట్టే రైతన్నను తెలంగాణలో సిఎం కెసిఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు.
కానీ, దేశంలో పిఎం మోడీ, అదే రైతన్నకు సున్నం పెట్టే పనులకు శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు అనుకూల నిర్ణయాలు, విధానాలు అవలంబిస్తున్నామన్నారు. రైతు బంధు ద్వారా పంటల పెట్టుబడులు, రుణాల మాఫీ, రైతులు చనిపోతే అతడి కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపడం వంటి అనేక పథకాలతో పాటు రైతాంగ దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించి కొంటూ, వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నామన్నారు.
అదే దేశంలో రైతుల భూములను కార్పొరేట్లకు అప్పగించే నూతన వ్యవసాయ బిల్లు, కొత్త విద్యుత్ బిల్లులను తెచ్చారని విమర్శించారు. దీంతో రైతులు కూలీలుగా మారే దుర్భర పరిస్థితులు దాపురించే అవకాశం ఉందన్నారు.