అధికారం వేరేవాళ్లకిస్తే అభివృద్ధి ఆగిపోతుంది- ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-11-25T21:52:25+05:30 IST
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధితో రాష్ర్టాన్ని, రాజధాని నగరాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తోందని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధితో రాష్ర్టాన్ని, రాజధాని నగరాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తోందని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధిని గెలిపిస్తే నిరంతరం అందుబాటులో ఉంటారని అన్నారు. కానీ వేరేపార్టీని గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమం ఢిల్లీలో ఉంటుందన్నారు. జీహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ ఫేజ్-1, 2లలో ఓటర్లను కలిసి ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్ధి జెర్రిపోతుల ప్రభుదాస్‌తో కలిసి ఇంటింటికీ తిరిగారు. ప్రతి ఒటరునూ కలిసి కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈసందర్భంగా కాశీ విశ్వనాధ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే టీఆర్‌ఎస్‌నే గెలిపించాలన్నారు. వేరే పార్టీని గెలిపిస్తే అభివృద్ధి కోసం ఢిల్లీనేతలను ప్రాధేయపడాల్సి వస్తుందన్నారు. మన వాళ్లయితే ఎప్పటికీ అందుబాటులో ఉంటారన్నారు. కారుకు ఓటు వేస్తే మన చేతుల్లోనే మన అభివృద్ధి, సంక్షేమం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన కొత్త పధకాలు జీహెచ్‌ఎంసి అభివృద్ధికి నాంది పలుకుతాయని అన్నారు.