రైతులకు అండగా నిలిచిన సిఎం కెసిఆర్
ABN , First Publish Date - 2020-10-07T20:54:01+05:30 IST
దేశానికి వెన్నెముక రైతు... అలాంటి రైతుకు అండగా నిలిచిన ఘనత సీఎం కెసిఆర్ గారికే దక్కుతుందని, రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం, పార్టీ ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

కొడకండ్ల(జనగామ): దేశానికి వెన్నెముక రైతు... అలాంటి రైతుకు అండగా నిలిచిన ఘనత సీఎం కెసిఆర్ గారికే దక్కుతుందని, రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం, పార్టీ ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల లో 130 మంది లబ్ధిదారులకు డిజిటల్ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, రైతును రాజు చేయడమే ప్రధాన ధ్యేయంగా సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని తెలిపారు. రైతాంగానికి సాగునీరు, ఉచితంగా 24 గంటలపాటు నాణ్యమైన కరెంటు, సంవత్సరానికి రెండు పంటలకు గాను ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం, రుణ మాఫీలు, రైతు బీమా, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, రైతులకు అందిస్తున్న ప్రభుత్వం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే లేదన్నారు. కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వం దేశంలో ఉందా? అని మంత్రి ప్రశ్నించారు. రైతుల ఆర్థిక స్థతిని పెంచేందుకే ప్రభుత్వం, సీఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. రైతుల బాగు కోసం ఎంతకైనా సిద్ధపడిన సిఎం కెసిఆర్ రైతుల ఆత్మబంధువు అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.