కరోనా పల్లెలకు పాకింది అప్రమత్తంగా ఉండాలి- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-08-12T23:41:05+05:30 IST

కరోనా వైరస్‌ పల్లెలకు పాకింది....ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సూచించారు

కరోనా పల్లెలకు పాకింది అప్రమత్తంగా ఉండాలి- ఎర్రబెల్లి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ పల్లెలకు పాకింది....ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సూచించారు. పల్లె ప్రగతి వంటి పథకాలు, నిరంతరం నిర్వహిస్తున్న పారిశుద్ద్యం వంటి కార్యక్రమాల వల్ల కరోనా విస్తృతి కొంత అదుపులో ఉన్నప్పటికీ అనేక మందికి సోకుతోందన్నారు. మొదట్లో ఉన్నంత తీవ్రత లేకపోయినప్పటికీ ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయన్నారు. దీన్నుంచి ప్రజలను బయటపడేయడానికి వీలుగా కమిటీలను పనిచేయాలని అన్నారు. కరోనా బాధితులను ఆదుకోవడానికి కమిటీలు కృషి చేయాలన్నారు. బాఽధితులకవసరమైన వైద్యం, నిత్యావసర సరుకులు అందేలా చూడాలన్నారు. కరోనా కట్టడి అయ్యే వరకూ పాలకుర్తిలో కొంత కాలంపాటు లాక్‌డౌన్‌ని కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. మంత్రి ఎర్రబెల్లి తన నియోజక వర్గమైన పాలకుర్తిప్రాంతానికి చెందిన అధికారులు, ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 


ఎక్కువ మంది గుమిగూడే మద్యందుకాణాలు, పబ్లిక్‌ప్లేస్‌లలో గుంపులుగా తిరగకుండా చూడాలని పోలీసులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆయా స్థలాలపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. పబ్లిక్‌ ప్లేస్‌లలో మద్యం సేవించే వారిని కూడా అదుపులో పెట్టాలని చెప్పారు. ఇక మాస్కులు లేకుండా తిరిగితే భారీగా జరిమానాలు విఽదించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామానికీ పోలీసులు ప్రతి రోజూ వెళ్లాలన్నారు. ప్రజల్లో చైతన్యం పెంచే విధంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు చాటింపులు వేయించాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. 

Updated Date - 2020-08-12T23:41:05+05:30 IST