మీర్‌పేట్‌లో మంత్రి ఎర్రబెల్లి ఎన్నికల ప్రచారం

ABN , First Publish Date - 2020-11-21T19:56:22+05:30 IST

గ్రేటర్‌ కార్పొరేషన్‌కు జరుగుతున్నఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల గెలుపుకోసం పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

మీర్‌పేట్‌లో మంత్రి ఎర్రబెల్లి ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌: గ్రేటర్‌ కార్పొరేషన్‌కు జరుగుతున్నఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల గెలుపుకోసం పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత రెండురోజుల నుంచి ఆయన ఉప్పల్‌ నియోజక వర్గం పరిధిలో పెద్దయెత్తున ప్రచారాన్నికొనసాగిస్తున్నారు. శనివారం మీర్‌పేట్‌ హౌసింగ్‌బోర్డు కాలనీలో పార్టీ అభ్యర్ధికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా కాలనీల్లో ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులతో సమన్వయ సమావేశాలుకూడా మంత్రి ఎర్రబెల్లి నిర్వహిస్తున్నారు. బస్తీల్లో చాయ్‌హోటల్స్‌ వద్ద జనంతో కలిసి టీ తాగారు. రోడ్డుపక్కన ఇస్ర్తీచేసుకునే చిరు వ్యాపారులు, రోడ్డుపై వెళ్తున్న ప్రయాణీకులు, మహిళలతో టీఆర్‌ఎస్‌పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. 


కారు గుర్తుకి ఓటు వేయాలని, ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ మంత్రి ఎర్రబెల్లి వినూత్న రీతిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల తర్వాత వాటిపై దృష్టిసారిస్తామన్నారు. పార్టీ అధిష్టానం టికెట్‌ ఇచ్చిన అభ్యర్ధిని గెలిపించే విధంగా పనిచేయాలని పార్టీనాయకులు, కార్యకర్తలకు సూచించారు. 

Read more