గ్రేటర్‌ వరంగల్‌లో వార్‌ వన్‌సైడే

ABN , First Publish Date - 2020-12-17T08:18:16+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ తరహాలో గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల్లో బీజేపీ మత చిచ్చు పాచికలు పారవని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

గ్రేటర్‌ వరంగల్‌లో వార్‌ వన్‌సైడే

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో బీజేపీ పాచికలు పారవు..
కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తన్నుకెళ్లారు

మామునూరు ఎయిర్‌పోర్టును జీఎంఆర్‌కు ఇస్తారా... సిగ్గుండాలి

సాగు చట్టాలను వ్యతిరేకించినందుకు కేసీఆర్‌పై పగబట్టిన మోదీ

బీజేపీపై భగ్గుమన్న మంత్రి ఎర్రబెల్లి 


వరంగల్‌ సిటీ/పాలకుర్తి, డిసెంబరు 16 : గ్రేటర్‌ హైదరాబాద్‌ తరహాలో గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల్లో బీజేపీ మత చిచ్చు పాచికలు పారవని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రానున్న గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరుపై నడకేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అధ్యక్షతన బుధవారం జరిగిన వరంగల్‌ మహానగర పాలక సంస్థ నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి దయాకర్‌రావు హాజరై మాట్లాడారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల వరంగల్‌ పర్యటనలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై చేసిన వ్యాఖ్యలకు దయాకర్‌రావు కౌంటర్‌ అటాక్‌ ఇచ్చారు. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సర్వేలన్నీ ఇదే విషయాన్ని తేల్చాయని ఆయన చెప్పారు. వరంగల్‌ నగర స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు వ్యయం రూ.2,300 కోట్లలో 21 శాతం నిధులు కూడా కేంద్రం ఇవ్వలేదని విమర్శించారు.


కాజీపేట వ్యాగన్‌ ఓవర్‌ హాలింగ్‌ కర్మాగారం విషయంలోనూ టీఆర్‌ఎ్‌సపై బీజేపీ నిందలు వేస్తోందని మండిపడ్డారు. ఓవర్‌ హాలింగ్‌ పరిశ్రమకు 160 ఎకరాలను ప్రభుత్వం సేకరించి ఇచ్చినా బీజేపీ వక్రీకరించడం శోచనీయమన్నారు. వ్యాగన్‌ పరిశ్రమను ఎవరడిగారని దయాకర్‌రావు ప్రశ్నించారు. దాంతో ఎవరికీ ప్రయోజనం, ఉద్యోగాలు రావన్నారు. కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని బీజేపీ గుజరాత్‌కు తన్నుకెళ్లిందని ఆరోపించారు. మామునూరు ఎయిర్‌పోర్టును ప్రైవేట్‌ సంస్థ జీఎంఆర్‌కు అప్పగించాలని బీజేపీ యత్నిస్తోందని, సిగ్గుండాలంటూ దయాకర్‌రావు ధ్వజమెత్తారు. ఎయిర్‌పోర్టు నిర్వహణ ప్రభుత్వ సంస్థకు ఉండాలన్నది టీఆర్‌ఎస్‌ సర్కారు అభిమతమన్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి వరంగల్‌ నగరంలో ప్రతిరోజు తాగునీటి సరఫరా జరుగనుందని మంత్రి దయాకర్‌రావు వెల్లడించారు. కాగా, జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగిన స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినందుకు సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ పగబట్డారని విమర్శించారు.

Updated Date - 2020-12-17T08:18:16+05:30 IST