బీజేపీ నేతలకు మంత్రి సవాల్!

ABN , First Publish Date - 2020-04-24T23:22:12+05:30 IST

బీజేపీ నేతల దీక్షలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో వందశాతం కొంటున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమే అని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై బీజేపీ

బీజేపీ నేతలకు మంత్రి సవాల్!

హైదరాబాద్: బీజేపీ నేతల దీక్షలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో వందశాతం కొంటున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమే అని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి... బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా తెలంగాణలో మాదిరిగా కొనుగోళ్లు జరుగుతున్నాయని నిరూపిస్తారా? అని రాష్ట్ర బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. పిడుగులు పడటం, వర్షాలు రావడం ప్రకృతి సహజం అని, అది ఒక్క తెలంగాణకే పరిమితం కాదన్నారు. ఈ విషయంలో రైతులకు ఉన్న స్పష్టత బీజేపీ నేతలకు లేకపోవడం విచారకరం అన్నారు. పిడుగుల మీద వితండవాదం చేయడం బీజేపీ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.



12,500 గ్రామపంచాయతీలకు పంటల సాగును పరిగణనలోకి తీసుకొని 7077 ధాన్యం, 1027 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆమోదించామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 5187 ధాన్యం, 923 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు. పంటల కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలను పెంచుకుంటూ పోవడం జరుగుతుందని చెప్పారు. పిడుగులు, అకాల వర్షాలకు రైతులు ఇబ్బందిపడడం అనేది విచారకరం అని పేర్కొన్నారు. దానిని రాజకీయం చేయడం బాధాకరమన్నారు. చనిపోయిన రైతు కుటుంబానికి భీమా సొమ్ము అందించడం జరిగిందని మంత్రి చెప్పారు. తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం కొంటున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో గత ఆరేళ్లలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిల్వ సామర్థ్యం 25 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచారని కొనియాడారు. సాగునీటి రాకతో సాగువిస్తీర్ణం పెరుగుతుందని గ్రహించి.. కొనుగోలు కేంద్రాలు పెంచడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల విషయంలో పూర్తి అవగాహనతో ఉందన్నారు. 


బీజేపీ నేతలు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు సాధిస్తే అదే వారు తెలంగాణకు చేసే పెద్ద మేలు అని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల పట్ల వారికి ప్రేమ, బాధ్యత ఉంటే పసుపు బోర్డు సాధించాలని సవాల్ విసిరారు. మద్దతు ధరకు పండిన పూర్తి పంటల కొనుగోలుకు అనుమతులు సాధించుకుని రావాలన్నారు. సాగునీరు, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలతో నైరాశ్యంలో ఉన్న తెలంగాణ రైతులలో ఆత్మవిశ్వాసం నింపింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. అసలు తెలంగాణ తెచ్చుకున్నదే  రైతుల సమస్యలను రూపుమాపేందుకు అన్నారు. తెలంగాణ రైతుబంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకునే కేంద్రం ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని రూపొందించి అమలు చేస్తోన్న  విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు.

Updated Date - 2020-04-24T23:22:12+05:30 IST