ఆరవ విడత హరితహారాన్ని విజయవంతం చేయాలి- అల్లోల

ABN , First Publish Date - 2020-05-18T22:29:39+05:30 IST

వచ్చే నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆరవ విడత హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్ధాయిలో సమాయత్తం కావాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఆరవ విడత హరితహారాన్ని విజయవంతం చేయాలి- అల్లోల

హైదరాబాద్‌: వచ్చే నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆరవ విడత హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్ధాయిలో సమాయత్తం కావాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గత అనుభవాలతో ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని ప్రణాళికలు  రూపొందించుకోవాలని సూచించారు. సోమవారం అరణ్యభవన్‌లో ఆరవ విడత హరితహారం కార్యక్రమం పై అటవీశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గతంలో నాటిన మొక్కలు, వాటి సంరక్షణ, వేసవి కాలంలో మొక్కలను కాపాడుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, గ్రీన్‌ ఫ్రైడే కార్యక్రమం, వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి సౌకర్యాలు తదితర అంశాలపై మంత్రి ఆరాతీశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరవ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో 3.59 కోట్ల మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉంచామన్నారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీలలో నర్సరీలను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆయా శాఖల ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, పీఆర్‌ అండ్‌ఆర్డీ పరిదిలోని నర్సరీల్లో 21.16 కోట్ల మొక్కలను పెంచామని తెలిపపారు. మొత్తంగా 24.74 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇందులో అటవీశాఖ తరపున హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణకు 1.42 కోట్ల మొక్కలు అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి శాఖ నుంచి నిర్ధేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని, అటవీశాఖ అధికారులు కూడా ఆయా శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో అటవీసంరక్షణ ప్రధానాధికారి శోభ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-18T22:29:39+05:30 IST