చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయండి:ఇంద్రకరణ్ రెడ్డి
ABN , First Publish Date - 2020-12-30T20:21:55+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలోని చిత్తడి నేలలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని చిత్తడి నేలలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అరణ్య భవన్ లో వెట్ ల్యాండ్ అథారిటీ మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవవైవిధ్యానికి నెలవైన ప్రాంతాలను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, తద్వారా చిత్తడి నేలల పరిరక్షణతో వాటి సంరక్షణకు మరింత భరోసా దొరుకుతుందన్నారు.
రాష్ట్రంలో ఉన్న చిత్తడి నేలలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించి వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులచే సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల నుంచే ఫిర్యాదులను కూడా పరిశీలించాలని చెప్పారు. పర్యావరణ, సాగునీరు, రెవెన్యూ, మత్స్య, అటవీ, తదితర శాఖల సమన్వయంతో స్థానికంగా ఉన్న చిత్తడి నేలలను గుర్తించి, సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
కలుషిత నీటి వల్ల మత్స్య సంపద, పక్షులు,వివిధ జీవరాసులు అంతరించిపోతున్నాయని, చిత్తడి నేలలో ఎక్కువగా మనుగడ సాగిస్తున్న జీవరాసులను కాపాడవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.ఈ సమావేశంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్, అదనపు పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) సిద్దానంద్ కుక్రేటీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.