శ్రామిక్ రైళ్లో ఒడిసాకు వలస కార్మికులు
ABN , First Publish Date - 2020-05-24T09:32:53+05:30 IST
ఒడిసాకు చెందిన వలస కూలీలను కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి మూడు శ్రామిక్ రైళ్లలో శనివారం అధికారులు వారి సొంత ప్రాంతాలకు తరలించారు.

జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్, సీపీ
కాజీపేట, మే 23: ఒడిసాకు చెందిన వలస కూలీలను కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి మూడు శ్రామిక్ రైళ్లలో శనివారం అధికారులు వారి సొంత ప్రాంతాలకు తరలించారు. ఒడిసాలోని బలంగీర్, అంగల్ జిల్లాలకు చెందిన కూలీలలకు ముందుగా అధికారులు ఓ ఫంక్షన్ హాల్లో భోజనాలు పెట్టి అనంతరం ఆర్టీసీ బస్సుల్లో వారిని రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చారు. అర్బన్ జిల్లాలతో పాటు పక్కజిల్లాలో పనిచేసే 1720 మంది కూలీలలను 24 బోగీలతో కూడిన ప్రత్యేక రైల్లోకి ఎక్కించారు. వీరికి జిల్లా వైద్య అధికారులు బృందం థర్మల్ స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహించి, మాస్కులు అందజేసి, శానిటైజేషన్ చేసిన అనంతరం రైలులోకి అనుమతించారు.
ఒక్కో బోగీలో సుమారు 72 మంది కూర్చుండేలా ఏర్పాట్లు చేసి, ఒక్కొక్కరికి నాలుగు వాటర్ బాటిళ్లు, రొట్టెలు, మీల్స్ ఇచ్చారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పర్యవేక్షణలో గ్రేటర్ మునిసిపల్ కమిషనర్ పమేలా సత్పతి, జిల్లా వైద్యాధికారి డా. లలితా దేవి, కాజీపేట, హసన్‌పర్తి తహసీల్దార్లు బి. నాగేశ్వర్ రావు, బి. రాజేశ్‌కుమార్ ఏర్పాట్లు చేశారు. డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీలు బి. రవీంద్రకుమార్, జనార్దన్, కాజీపేట ఇన్స్పెక్టర్ ఆర్. నరేందర్ బందోబస్తు నిర్వహించారు. కాగా, కమిషనర్ పమేలా సత్పతి ఒడిస్సీలో అనౌన్స్మెంట్ చేస్తూ కార్మికులకు పలు సూచనలు చేశారు. వారిలో మనోధైర్యాన్ని నింపారు.
జెండా ఊపిన కలెక్టర్, సీపీ
కార్మికులందరూ రైల్లోకి చేరిన అనంతరం సాయంత్రం 5.45 నిమిషాలకు ఒకటో ప్లాట్ ఫాం నుంచి కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, పోలీస్ కమిషనర్ రవిందర్, గ్రేటర్ కమిషనర్ సత్పతి జెండా ఊపి రైలును ప్రారంభించారు. అనంతరం మరో రెండు శ్రామిక్ రైళ్ల ద్వారా మూడు వేల మందికిపైగా కూలీలలను తరలిస్తామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు.