నిప్పులపై కాళ్లు.. నీళ్లింకిన కళ్లు

ABN , First Publish Date - 2020-05-17T08:09:34+05:30 IST

దేహాల నుంచి ధారగా కారిన చెమటలు.. కారుతున్న కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. ఇంకెప్పుడు గమ్యం చేరేదంటూ నాసికా పుటాల నుంచి నిట్టూర్పులు సెగలు గక్కుతున్నాయి. వారి దయనీయస్థితిని చూసిన....

నిప్పులపై కాళ్లు.. నీళ్లింకిన కళ్లు

భార్యాపిల్లలతో మండుటెండల్లో కూలీల నడక

శ్రామిక్‌ రైళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపు

పోలీస్‌ స్టేషన్లలో దరఖాస్తులు.. దక్కని పాసులు

జాతరను తలపిస్తున్న 44వ జాతీయ రహదారి

దాతలు పెడితే భోజనం.. లేదంటే తప్పని పస్తులు

2 ప్రమాదాల్లో ముగ్గురు మృతి.. ఇద్దరు విషమం

దేశంలో ఒకేరోజు 60 మంది కూలీల మరణం


దేహాల నుంచి ధారగా కారిన చెమటలు.. కారుతున్న కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. ఇంకెప్పుడు గమ్యం చేరేదంటూ నాసికా పుటాల నుంచి నిట్టూర్పులు సెగలు గక్కుతున్నాయి. వారి దయనీయస్థితిని చూసిన ఎవరికైనా కళ్లవెంట నీళ్లొస్తున్నాయి. ఆ వలస కూలీల్లో అలుపు లేదు.. ఉన్నచోట ఆకలితో చచ్చే బదులు.. సొంతూరిలో కలో గంజో తాగుతామనే ఆశే నడిపిస్తోంది.


‘‘నమస్తే సర్‌, మాది ఉత్తరప్రదేశ్‌. నేను మీ సైకిల్‌ తీసుకెళుతున్నాను. నన్ను క్షమించండి. నాకు వేరే దారిలేదు. నాకు ఓ దివ్యాంగుడైన కొడుకు ఉన్నాడు. వాడు నడవలేడు. మేం మా ఊరు వెళ్లాలి. వాడి కోసమే ఈ పని చేస్తున్నాను’’ ఈ లేఖ.. రాజస్థాన్‌లో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్‌ ఇక్బాల్‌ది. లాక్‌డౌన్‌ దెబ్బతో పనిపోయింది. చేతిలో డబ్బులు అయిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సైకిల్‌ దొంగిలించాడు. ఆ సైకిల్‌ యజమానిని క్షమించమని వేడుకుంటూ లేఖ రాసిపెట్టి వెళ్లాడు. తర్వాత ఆ లేఖ చదివిన యజమాని.. ట్విటర్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): అది పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌ టోల్‌గేట్‌. యూపీ వెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి 30 మంది వలస కూలీల బృందం నడుచుకుంటూ అక్కడికి చేరుకుంది. ఛత్తీ్‌సగఢ్‌లోని రాయ్‌పూర్‌కు వెళ్లేందుకు సిద్దిపేట నుంచి బయలుదేరిన 16మంది కూడా అక్కడికి వచ్చారు. శుక్రవారం రోజంతా తిండిలేక మంచినీళ్లు తాగే గడిపామని వాళ్లు చెప్పారు. టోల్‌గేట్‌ వద్ద స్థానికులు వారికి భోజనాలు పెట్టారు. ఇంత ఎంగిలి పడ్డారో లేదో మళ్లీ నడక ప్రారంభించారు.  


వారంతా యూపీకి చెందిన 20 మంది వలస కార్మికులు. కర్ణాటకలోని గుల్బర్గాలోని ఐస్‌క్రీం కంపెనీలో పనిచేసేవారు. అది మూతపడటంతో పోగేసుకున్న డబ్బుతో సెకండ్‌ హ్యాడ్‌ బైక్‌లు కొన్నారు. పిల్లాజెల్లాతో బైక్‌లపై సొంత రాష్ట్రంవైపు సాగుతున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కోహిర్‌ దిగ్వాల్‌ శివారులోని జాతీయ రహదారి మీద కనిపించారు.  


అది మెదక్‌ జిల్లాలోని 44వ నంబరు జాతీయ రహదారి. బాలానగర్‌లోని బ్యాటరీ కంపెనీలో పనిచేసే 10మంది జార్ఖండ్‌ కార్మికులు సొంతూర్లకు వెళ్లేందుకు శ్రామిక్‌ రైళ్ల కోసం ప్రయత్నించారు. సాధ్యపడలేదు. ఆవైపు వెళుతున్న లారీలను అడిగితే తాలా రూ.3000-4000 దాకా అడుగుతున్నారు. సొంతూర్లోని ఇంటోళ్లకు చెబితే వారు అప్పు చేసి ఖాతాల్లో డబ్బులు వేశారు. వాటితో ఒక్కొక్కరు రూ.4,500తో సైకిళ్లను కొని సొంతూరువైపు సాగుతున్నారు. 


..నెత్తిమీద మూటలతో, చంకలో చంటి పిల్లలతో.. మండుటెండల్లో చెప్పుల్లేకుండా పగుళ్లు తేలి.. బొబ్బలెక్కిన కాళ్లతో నడుస్తూ.. ఆకలిదప్పులతో అలమటిస్తున్న పిల్లలు నడవలేమని కడుపును చేతులతో పట్టుకొని ఏడుస్తుంటే వారిని సముదాయిస్తూ.. వీలైతే వారినీ భుజానెత్తుకుంటూ.. తాము పస్తులుంటూ.. పిల్లలను అర్ధాకలితో మాడుస్తూ వలస కూలీల నడక స్వస్థలాలవైపు సాగుతూనే ఉంది. దేహాల నుంచి ధారగా కారిన చెమటలు.. కారుతున్న కన్నీళ్లు అలిసి ఇంకిపోతున్నాయి. వారి దయనీయస్థితిని చూస్తుంటే ఎవరికైనా మనసు కరిని కళ్లవెంట నీళ్లొస్తున్నాయి. ఆ వలస కూలీల్లో మాత్రం అలుపు లేదు. సొంతూరికి పోతే కలో గంజో అక్కడే తాగుతామనే చిన్న ఆశే వారిని నడిపిస్తోంది. రాష్ట్రంలో ఏ ప్రధాన రహదారిలో చూసినా కుటుంబాలతో వందల సంఖ్యలో చీమలదండులా కదులుతున్న కూలీలే కనిపిస్తున్నారు. రోజుకు 35 కిలోమీటర్లు నడుస్తున్నారు. కొందరు సైకిళ్లపై.. ఇంకొందరు బైక్‌లపై.. మరికొందరు లారీల్లో ప్రయాణం సాగిస్తున్నారు! శనివారం వలస కూలీల అవస్థలను క్షేత్రస్థాయిలో ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించినప్పుడు కళ్లు చెమర్చే దృశ్యాలు కనిపించాయి. సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ప్రభుత్వాలు శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేశాయి కదా? అని కూలీలను ప్రశ్నించినప్పుడు.. తాము పోలీస్‌ స్టేషన్లకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నా పాసలు రావడం లేదని అందుకే నడుచుకుంటూ వెళుతున్నామని ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పుకొని వాపోయారు. అక్కడక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెడుతున్న భోజనం.. రోడ్ల మీద దాతలు ఇచ్చే బిస్కెట్లు తింటూ నడక సాగిస్తున్నామని చెప్పారు.


ఊరికి చేరితే అదే పదివేలని..  

మహారాష్ట్ర, యూపీ, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు వెళుతున్న కూలీలతో రాష్ట్రంలోని 44వ నంబరు జాతీయ రహదారి జాతరను తలపిస్తోంది. ఎలాగో అలా సొంతూరుకు చేరుకుంటే అదే పదివేలని అనుకుంటూ నిత్యం ఈ రోడ్డు వెంట నడుచుకుంటూ సొంతూర్లకు వెళుతున్న వందల మంది జనం.. కిక్కిరిసిన జనంతో వెళుతున్న లారీలు కనిపిస్తున్నాయి. అలాగే, చెన్నై నుంచి బిహార్‌కు 30 మంది  కూలీలతో వెళుతున్న మినీ బస్సు కనిపించింది. కూలీలను అడగ్గా రూ.1.2లక్షల కిరాయికి మినీ బస్సును మాట్లాడుకొని బయలుదేరామని చెప్పారు. 


పశువుల లెక్కన లారీల్లో కుక్కి 

సొంతూళ్లకు వెళ్తున్న వలస కార్మికులకు రవాణా సౌకర్యాలు సరిపడా లేకపోవడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం సాగిస్తున్నారు. నాగపూర్‌   రహదారి వెంట ఖాళీగా వెళ్తున్న లారీలు, ట్రక్కులను ఆపి వాటిలో ఎక్కుతున్నారు. కూలీల నుంచి లారీలు, ట్రక్కుల డ్రైవర్లు చార్జీల రూపంలో రూ.2వేల నుంచి రూ.3వేల దాకా వసూలు చేస్తున్నారు. డబ్బుల కక్కుర్తితో డ్రైవర్లు.. ఒక్కో లారీలో 80 నుంచి 100 మందిని పశువుల లెక్కన కుక్కుతున్నారు. 


ఇంటి దగ్గర అమ్మనాన్న  యాదికొస్తున్నారు

ఇల్లు జ్ఞాపకమొస్తోంది. అక్కడే ఉంటున్న అమ్మనాన్నలు గుర్తుకొస్తున్నారు. మూడు నెలల క్రితం రామగుండం వచ్చాం. అక్కడ ఒక ఫంక్షన్‌ హాల్లో పనిచేస్తున్నాం. వారు సగం జీతమే ఇచ్చారు. ఇక ఇవ్వడం కుదరదంటున్నారు. ఇక్కడే ఉంటే పస్తులతో ప్రాణం పోయేట్లుంది. అందుకే రామగుండం నుంచి నడుచుకుంటూ వెళుతున్నాం. మా ఊరు ఇక్కడ నుంచి 450 కిలోమీటర్లు ఉంటంది. అక్కడిదాకా నడిచే వెళ్తాం. దారిలో దయగలవారు ఎవరైనా ఆపి ఇంత అన్నం పెడితే తింటాం. లేకుంటే నీళ్లు తాగుకుంటూనే వెళ్తాం. సర్కారు ఏమిస్తుందో తెల్వదు. ఇస్తుందని అంటున్నారు. మేము మొత్తం నాశనమైనంక ఇస్తదా?  


- రాజు, రాజ్‌నంద్‌గావ్‌, ఛత్తీ్‌సగఢ్‌



Updated Date - 2020-05-17T08:09:34+05:30 IST