రైలు పట్టాలపై అలుపెరగని ప్రయాణం..

ABN , First Publish Date - 2020-04-26T23:08:54+05:30 IST

వలస కూలీలు గమ్య స్థానాలకు చేరేందుకు రైల్వే ట్రాకులిప్పుడు రహదారులుగా మారాయి. జాతీయ రహదారుల గుండా వెళితే...

రైలు పట్టాలపై అలుపెరగని ప్రయాణం..

హైదరాబాద్: వలస కూలీలు గమ్య స్థానాలకు చేరేందుకు రైల్వే ట్రాకులిప్పుడు రహదారులుగా మారాయి. జాతీయ రహదారుల గుండా వెళితే పోలీసులు అడ్డుకోవడంతో ఎలాగైనా ఇంటికి చేరాలనే సంకల్పంతో పట్టాలపై అలుపెరగని ప్రయాణం చేస్తున్నారు. నిజానికి దేశవ్యాప్తంగా వలస కార్మికుల కష్టాలు అన్ని ఇన్ని కావు. లాక్‌డౌన్‌తో రోజు రోజుకు నానా కష్టాలు పడుతున్నారు. కరోనా లాక్‌డౌన్ ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశం లేకపోవడంతో వేలాది మంది వలస కూలీలు సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు నడిచి వెళ్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన వేలాది మంది ఉత్తరాధి రాష్ట్రాల కూలీలు లాక్‌డౌన్‌తో ఇక్కడే చిక్కుకుపోయారు. వాహనాల్లో వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, క్వారంటైన్‌లో ఉండలేక మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల మీదుగా తమ ప్రాంతాలకు తరలివెళుతున్నారు. కష్టాలు పడుతూ తినడానికి తిండిలేకున్నా అలుపెరగని ప్రయాణం చేస్తున్నారు. జాతీయ రహదారుల గుండా వెళితే పోలీసులు అడ్డుకోవడంతో ట్రైన్ ట్రాక్‌పై నడుస్తున్నారు. ట్రాక్ గుండా వెళితే తనిఖీలు లేకపోవడం, తమ గమ్య స్థానానికి దూరం కూడా తక్కువ కావడంతో రైల్వే ట్రాక్ గుండా వెళుతున్నారు. ఎక్కడైనా దారిలో దాతలు పెట్టే తిండితో కడుపు నింపుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా గిమ్మ మీదుగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ వైపు రోజూ వలస కూలీల ప్రయాణం కొనసాగుతోంది. 

Updated Date - 2020-04-26T23:08:54+05:30 IST