వలసకూలీల విషాదగాధ
ABN , First Publish Date - 2020-04-26T14:13:43+05:30 IST
వలసకూలీల విషాదగాధ

హైదరాబాద్: నడక సాగిస్తున్న వలసకూలీల బాధలు ఓ లెక్కైతే... ఎక్కడికక్కడ చిక్కుకుపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్న వలసకూలీల కష్టాలు మరో లెక్క అన్నట్లుంది. గుప్పెడు మెతుకులు, నీళ్లు దొరక్క అల్లాడిపోతున్న వలసకూలీలు ఎందరో. బాధపడుతున్నారు.... వేడుకుంటున్నారు...ఏడుస్తున్నారు. అందరి వేదన వెనక అభ్యర్థన ఒక్కటే సొంతూరుకు వెళ్లిపోతామని. సొంతూళ్లకు వెళ్లలేరు... ఉన్నచోటే ఉండలేరు. కడుపు నిండా తిండి లేదు... కంటినిండా నిద్ర లేదు. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి అనేక పనుల నిమిత్తం తరలివెళ్లి...చిక్కుకుపోయిన వలసకూలీల దుస్థితి ఇది.
వలస కార్మికులు ఆకలితో అలమటించకూడదు అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసరాలు, నగదు ఇచ్చి ఆదుకోవాలని ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో అందరికీ అవి అందడం లేదు. ఫలితంగా పని లేక, చేతిలో చిల్లిగవ్వ లేక గుప్పెడు మెతుకులు కూడా గొంతు దిగని పరిస్థితిలో ఉన్నారు. హైదరాబాద్ ఔటర్ ఇరు వైపులా ఉన్న కోకాపేట, నార్సింగ్, పుప్పాలగూడ ఏరియాల్లో బహుళ అంతస్థుల భవన నిర్మాణంలో పనిచేసే వలస కార్మికులు ఇప్పటికీ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
వలసకార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రూ.500 నగదు, 12 కిలోల బియ్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దానిని అమలు చేసే బాధ్యత రెవెన్యూ శాఖకు అప్పగించారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం బడా వ్యాపారులకు చెందిన బహుళ అంతస్థుల భవన నిర్మాణాలకు చెందిన క్యాంపుల్లో ఉండే కార్మికులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మిగతావారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
హైదరాబాద్‌లో నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కూలీల్లో ఎక్కువ శాతం శ్రీకాకుళం వాసులే. లాక్‌డౌన్ వల్ల సొంతూళ్లకు వెళ్లలేక, హైదరాబాద్‌లో చిక్కుకుపోయారు. మరికొంతకాలం లాక్‌డౌన్ కొనసాగితే ఇక్కడ ఉండే పరిస్థితి లేదని తేల్చిచెప్పిన వలస కూలీలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవచూపి సొంతూర్లకు తరలించాలని వేడుకుంటున్నారు.
ఢిల్లీలో చిక్కుకున్న వలసకార్మికులు సరెైన ఆహారం కూడా దొరకని పరిస్థితుల్లో యమునా నది ఒడ్డున ఓ శ్మశానం పక్కన పడేసిన అరటిపండ్లు ఏరుకుని తిన్నారు. ఎండలకు పాడైన అరటిపండ్లను వ్యాపారు అక్కడ పాడేశారు. వాటిలో ఏమన్నా మంచివి దొరుకుతాయోమో అని కొందరు వలస కూలీలు ఏరుకుని తింటున్నారు. పూర్తిగా పస్తులు ఉండటం కన్నా ఏదోకటి తినడం నయం కదా అన్నారు. ఇప్పటి వరకు వలస కూలీలకు సంబంధించి కేరళ మినహా మరే రాష్ట్రమూ బెటర్ పాలసీ ప్రవేశపెట్టలేదు. అయితే ఆ రాష్ట్రం కూడా తొలుత తప్పటడుగు వేసినప్పటికీ వెంటనే సరిదిద్దుకుంది. మూడు లక్షల మంది వలస కూలీలకు దాదాపు 19 వేల షల్టర్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న కేరళకు మార్చి 29న పెద్దషాక్ తగిలింది. కొట్టాయంలో వేల మంది వలసకూలీలు వీధుల్లోకి వచ్చారు. మీ ఆశ్రయం వద్దు, మీ భోజనం వద్దు మమల్ని ఇళ్లకు పంపేయండంటూ గొడవ ప్రారంభించారు. పోలీసులు ఎలాగోలా బుజ్జగించి వారందరినీ తిరిగి షెల్టర్లకు పంపారు.
ముఖ్యమంత్రి విజయన్ వెంటనే అధికారులతో సమీక్ష జరిపారు. ఎక్కడ తప్పు జరిగిందో ఆరా తీశారు. వెంటనే వ్యూహాన్ని మార్చేశారు. వారి మొదటి సమస్య ఆహారం. వెంటనే మెనూ మార్చేశారు. వారికి వారు వండుకునేందుకు వీలుకల్పించారు. ఎక్కడో ఉన్న కుటుంబసభ్యులతో మాట్లాడుకునేందుకు రీచార్జ్ చేయించారు. బోర్ కొట్టకుండా ఇండోర్ గేమ్స్ ఏర్పాటు చేశారు. దీంతో కార్మికులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. కానీ కేరళ మినహా మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో సౌకర్యాలు లేవు.
ఇటీవల తెలంగాణ నుంచి 11కిలోమీటర్ల దూరంలో ఉన్న యూపీకి వెళ్తున్న వలస కార్మికుడిని ప్రశ్నిస్తే ఇక్కడ అన్నం తినలేక వెళ్తున్నామని అన్నాడు. ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి చిన్న చిన్న కారణాలు విస్మరించడం వల్లే వలసకూలీలు సొంతూర్ల బాట పట్టారు. ఏప్రిల్ 13న లాక్‌డౌన్ పొడిగిస్తున్నాం అనే ప్రకటన రాగానే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. సొంత రాష్ట్రాలకు పంపించాలంటూ ధర్నాలకు దిగారు. ఎప్పుడెప్పుడు లాక్‌డౌన్ ఎత్తేస్తారా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అంటే ఈ లెక్కన లాక్‌డౌన్‌కు చెక్ పెట్టగానే ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోతారు. అదే జరిగితే నిర్మాణ రంగం పరిస్థితి ఏంటి?...
కన్‌స్ట్రక్షన్ పనులకు భారీనిర్మాణాలకు వలస కార్మికులే ఆధారం. బీహార, మధ్యప్రదేశ్, బెంగాల్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చిన నిర్మాణ రంగ కార్మికులు వెళ్లిపోతే పరిస్థితి ఎలా మారబోతోంది. వీళ్లంతా సొంతూళ్ల బాట పడితే రాబోయే రోజుల్లో నిర్మాణ రంగంపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సి.ప్రభాకర్ రావు తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే వలసకార్మికుల విషాదగాధలకు అంతే లేదు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా ఇదే పరిస్థితి.