మట్టి మిద్దె.. మరుభూమాయె!
ABN , First Publish Date - 2020-10-27T08:56:16+05:30 IST
తండ్రి సంవత్సరీకం కోసం వేర్వేరుచోట్ల ఉంటున్న కుమారులు, వారి భార్యలు, పిల్లలు అంతా సొంతూరులోని ఇంటికి వచ్చారు. తమ తల్లి సమక్షంలో ఆ కార్యక్రమాన్ని

అర్ధరాత్రి కూలిన పైకప్పు.. నిద్రలోనే ఐదుగురి దుర్మరణం
ముగ్గురికి గాయాలు.. అంతా ఒకే కుటుంబం
తండ్రి పుణ్యతిఽథికి వేర్వేరు చోట్ల నుంచి సొంతూరుకు
దసరా పండుగ కోసం ఆగడమే కొంప ముంచింది
వనపర్తి జిల్లా బుద్ధారం గ్రామంలో పెను విషాదం
వనపర్తి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తండ్రి సంవత్సరీకం కోసం వేర్వేరుచోట్ల ఉంటున్న కుమారులు, వారి భార్యలు, పిల్లలు అంతా సొంతూరులోని ఇంటికి వచ్చారు. తమ తల్లి సమక్షంలో ఆ కార్యక్రమాన్ని జరిపించారు. మరుసటి రోజు అంతా కలిసి ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలనే ఆలోచనతో అక్కడే ఉండిపోయారు. రాత్రి కలిసి భోజనం చేసి నిద్రపోయారు. వారిలో ఐదుగురికి అదే శాశ్వత నిద్ర అయింది!! నీడగా ఉన్న గూడే వారి ప్రాణాలను తీసింది. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న సమయంలో పైకప్పు కుప్పకూలింది. ఆ శిథిలాలు మీద పడటంతో ఐదుగురు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్ధారం గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘోర విషాదం జరిగింది. తెల్లవారితే దసరా అనగా ఇంట్లో ఐదుగురు మృత్యువాత పడటంతో ఆ కుటుంబసభ్యులు కంటికీ మంటికీ ధారగా విలపించారు. ఆ విషాదాన్ని చూసిన స్థానికుల గుండెలు బాధతో బరువెక్కాయి. మృతులు... ఇంటి పెద్ద చెవ్వా మణెమ్మ (68), ఆమె కోడళ్లు ఉమ (28), సుప్రజ (35), సుప్రజ ఇద్దరు పిల్లలు వైష్ణవి (15), అక్షయ (13). మరో ముగ్గురికి గాయలయ్యాయి.
80 ఏళ్ల క్రితం పూర్తిగా మట్టితో పైకప్పుతో ఇంటిని నిర్మించారని, ఇటీవల వర్షాలకు పైకప్పు బాగా నానిపోవడంతోనే కూలిపోయిందని చెబుతున్నారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. బుద్ధారం గ్రామానికి చెందిన నర్సయ్య, మాణెమ్మ దంపతులు. వీరికి నలుగురు కుమారులు శేఖరయ్య శెట్టి, కుమారస్వామి, యాదయ్య శెట్టి, రాఘవేంద్ర ఉన్నారు. శేఖరయ్య శెట్టి, వనపర్తిలో బట్టల దుకాణాన్ని నడుపుతున్నాడు. యాదయ్య శెట్టి, అదే ఊర్లో మరో ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. రాఘవేంద్ర, గద్వాలలో కిరాణం షాపు నిర్వహిస్తున్నాడు. కుమారస్వామి కూడా గద్వాలలో స్థిరపడ్డాడు. అనారోగ్యం కారణంగా నర్సయ్య నిరుడు మృతిచెందాడు. ఆయన సంవత్సరీకం జరిపించేందుకు శనివారం నలుగురు కుమారులు తమ భార్యాపిల్లలతో బుద్ధారంలోని ఇంటికి చేరుకున్నారు. ఇంటి పెద్దను స్మరించుకొని ఘనంగా నివాళులర్పించారు. పెద్ద కుమారుడైన శేఖరయ్య శెట్టి మాత్రం తన భార్యాపిల్లలతో కలిసి అదే రోజు రాత్రి తిరిగి వనపర్తి వెళ్లిపోయాడు. మరో కుమారుడు యాదయ్యశెట్టి కూడా భార్యాపిల్లలతో గ్రామంలోనే ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు.
తల్లి మణెమ్మతో కలిసి రాఘవేంద్ర, ఆయన భార్య ఉమ, వీరి కుమార్తె శ్రీజ.. కుమారస్వామి, ఆయన భార్య సుప్రజ, వారి పిల్లలు వైష్ణవి, అక్షయ ఆ ఇంట్లోనే ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మట్టి మిద్దె కూలిపోయి నిద్రిస్తున్న ఎనిమిది మందిపై పడింది. మణెమ్మ, ఉమ, సుప్రజ, వైష్ణవి, అక్షయ అక్కడికక్కడే మృతిచెందారు. ఇంటి దూలం బలంగా తగలడంతో కుమారస్వామికి వెన్నెముకకు తీవ్ర గాయమైంది. రాఘవేంద్ర, ఆయన కుమార్తె శ్రీజకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ పెను విషాదం, గ్రామస్థులను తీవ్రంగా కలిచివేసింది. ఆ బాధతో ఊరు ఊరంతా పండుగకు దూరంగా ఉన్నారు. అక్కడి ప్రజలంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం అందించేందుకు కృషిచేస్తానని భరోసా ఇచ్చారు.
