ఎంజీఎం బాస్‌ రాజీనామా

ABN , First Publish Date - 2020-07-28T10:51:44+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బత్తుల శ్రీనివాసరావు

ఎంజీఎం బాస్‌ రాజీనామా

విధుల నుంచి తప్పుకున్న సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు

ఆరోగ్యం సహకరించడం లేదంటూ డీఎంఈకి లేఖ 

రాజకీయ ఒత్తిళ్లే కారణమంటున్న ఎంజీఎం వర్గాలు

నూతన అధికారి కోసం ప్రభుత్వం కసరత్తు 

పరిశీలనలో డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ గోపాల్‌రావు 

నేడో రేపో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం 


వరంగల్‌ అర్బన్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బత్తుల శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఈ హఠాత్‌ పరిణామంతో ఎంజీఎం వర్గాలు గందరగోళానికి గురవుతున్నాయి. ఎంజీఎం వైద్యులపై దాడులు, కరోనా రోగుల ఆకలి కేకలు, వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది కరోనా  బారిన పడ్డారు. ఎంజీఎం పరిపాలనా పదవుల్లో ఉన్న వారి కుటుంబాలు సైతం కొవిడ్‌ సమస్యతో సతమతమవుతున్నాయి. సూపరింటెండెంట్‌ కుటుంబ సభ్యులు కూడా కరోనా బాధితులేనని సమాచారం. మరోవైపు ఎంజీఎంలో కరోనా రోగులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి విపత్కర సమయంలో ఎంజీఎంకు పెద్ద దిక్కుగా నిలవాల్సిన సూపరింటెండెంట్‌ రాజీనామా  చేయడం సంచలనంగా మారింది. రాజీనామా వెనుక దాగిన అసలు రహస్యం ఏమిటా అన్నది ఇపుడు  పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


ఆరోగ్యం సహకరించడం లేదు.. 

ఎంజీఎం సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు సోమవారం రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేష్‌ రెడ్డికి లేఖ రాశారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, బీపీ పెరిగిపోతున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో తాను పనిచేయలేనని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. దీంతో చేసేది లేక వైద్య ఆరోగ్య శాఖా ఉన్నతాధికారులు మరో సూపరింటెండెంట్‌ను ఎంపిక చేయడానికి కసరత్తు ప్రారంభించారు. 


ఇతర కారణాలున్నాయా...

సూపరింటెండెంట్‌ రాజీనామాకు కారణం అనారోగ్యం కాక పోవచ్చన్నది ఎంజీఎం వర్గాల వాదన. కరోనా సమయంలో అరకొర వసతులు, వైద్యులు, సిబ్బంది కొరత, నిధుల లేమి, వీటన్నిటికి మించి రాజకీయ ఒత్తిళ్లు కారణం  కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.


అధికార పార్టీ నేతల పెత్తనం.. 

సూపరింటెండెంట్‌పై గతంలో ఎన్నడూ లేనంత రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నట్టు వైద్య వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఎంజీఎం సూపరింటెండెంట్‌గా శ్రీనివాసరావు గత ప్రభుత్వంలో ఓ ప్రజా ప్రతినిధి అండదండలతో  బాధ్యతలు స్వీకరించాడన్న ప్రచారం ఉంది. తర్వాత కాలంలో సదరు నేత అధికార పార్టీకి దూరం కావడంతో ఈయనకు కొత్త కష్టాలు మొదలైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజా ప్రతినిధి తన మీద కారాలు మిరియాలు నూరుతున్నాడని తెలిసి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారని, చివరికి తన సామాజిక వర్గానికి చెందిన నగరంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాని మధ్యవర్తిత్వంతో సంధి కుదిరినట్టు  తెలిసింది.  అయినప్పటికీ ప్రతీ చిన్న పనికి సంబంధించిన పనిలో తన వాళ్లే ఉండాలన్న షరతు విధించడం, కాదంటే పదవిపోతుందన్న స్థాయిలో బెదిరింపులు రావడంతో విధిలేక రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. 


అరకొర వసతులూ కారణమే...

ప్రజా ప్రతినిధి ఒత్తిడితో పాటు మరో వైపు ఎంజీఎంలో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితులు కూడా తన రాజీనామాకు కారణం కావచ్చంటున్నారు. ప్రత్యేక కొవిడ్‌ వార్డు ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి తగినంత నిధులు రాక పోవడం, సిబ్బంది నియామకాలు లేక పోవడం.. పనిచేస్తున్న వారిలో డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది కరోనా బాధితులుగా మారడం, చికిత్సకు సరైన వసతి లేకపోవడం, ఎంజీఎం సిబ్బందికి ప్రత్యేకంగా కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా చేయించలేని దుస్థితిలో ఉండడం, మరో వైపు వైద్యులు పట్టించుకోవడం లేదని రోగుల సెల్ఫీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేయడంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 


పరిశీలనలో ఇద్దరి పేర్లు..

ఎంజీఎం సూపరింటెండెంట్‌ ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఆ స్థానం భర్తీ చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇటీవలి కాలం వరకు కొవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన డాక్టర్‌ చంద్రశేఖర్‌, సీనియర్‌ డాక్టర్‌ గోపాల్‌రావు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అన్ని రకాల సమీకరణలు పూర్తయితే నేడో రోపో వీరిలో ఎవరో ఒకరు ఎంజీఎం సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు  ఉన్నాయి.

Updated Date - 2020-07-28T10:51:44+05:30 IST