జంట మెట్రో!

ABN , First Publish Date - 2020-02-08T08:14:26+05:30 IST

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలు మరోసారి కలిశాయి! ఈసారి వాటిని కలిపింది మాత్రం మెట్రో రైలు! ఇప్పుడు ఎంజీబీఎస్‌ నుంచి ..

జంట మెట్రో!

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ను కలిపిన కారిడార్‌

జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ కారిడార్‌-2 ప్రారంభం

నేటి  ఉదయం 6.30 గంటల నుంచే 

ప్రయాణికులకు అందుబాటులోకి

అటు పటాన్‌ చెరు.. ఇటు హయత్‌ నగర్‌

మరో 100 కిలోమీటర్లకు మెట్రో విస్తరణ

నలుమూలల నుంచీ శంషాబాద్‌కు

ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయండి

దశలవారీగా నిర్మాణం పూర్తి చేద్దాం

మెట్రో అధికారులతో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలు మరోసారి కలిశాయి! ఈసారి వాటిని కలిపింది మాత్రం మెట్రో రైలు! ఇప్పుడు ఎంజీబీఎస్‌ నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలనుకోండి.. ఎంచక్కా మెట్రో ఎక్కి వెళ్లిపోవచ్చు! జూబ్లీ బస్‌ స్టేషన్‌ నుంచి ఎంజీబీఎ్‌సకు రావాలనుకోండి.. మెట్రో ఎక్కి వచ్చేయవచ్చు! ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ నుంచి హైటెక్‌ సిటీకీ వెళ్లిపోవచ్చు.. మియాపూర్‌కూ వెళ్లవచ్చు! ఈ మేరకు  జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ మెట్రో కారిడార్‌ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం జూబ్లీ బస్‌ స్టేషన్‌ వద్ద నిర్మించిన మెట్రో ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌లో పచ్చజెండా ఊపి కొత్త కారిడార్‌ను ప్రారంభించారు. అనంతరం, అదే మెట్రోలో ఎంజీబీఎస్‌ వరకు ప్రయాణించారు. మధ్యలో చిక్కడపల్లి మెట్రో స్టేషన్‌లో కొద్ది క్షణాలపాటు ఆగి.. ఫ్లాట్‌పామ్‌పైకి వచ్చిన స్థానిక ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. మళ్లీ అక్కడి నుంచి నేరుగా ఎంజీబీఎస్‌ మెట్రో ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌ వరకు మెట్రోలో ప్రయాణం చేశారు. ఆ మెట్రో స్టేషన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యాలయాలు, స్టేషన్‌ పరిసరాలను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా, మెట్రో ప్రాజెక్టు వివరాలతోపాటు ఎంజీబీఎస్‌ ఇంటర్‌ చేంజ్‌ ప్రత్యేకతలను మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. 


ఎంజీబీఎస్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని పలు ప్రత్యేకతలతో నిర్మించారు. 58 పిల్లర్లు, 6 గ్రిడ్స్‌తో పూర్తిస్థాయి స్టీల్‌, కాంక్రీట్‌తో దీనిని నిర్మించారు. మెట్రో ఉన్నతాధికారులు, ఉద్యోగులు ముఖ్యమంత్రితో ఫొటోలు దిగారు. అంతకుముందు, జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఎస్కలేటర్‌, మెట్ల మార్గం ద్వారా ప్లాట్‌ఫాంపైకి చేరుకుని మెట్రో రైలుకు పచ్చ జెండా ఊపారు. తద్వారా, భాగ్యనగరవాసుల కల సంపూర్ణమైంది. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రతిపాదించిన 73 కిలోమీటర్ల మార్గంలో 69 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీంతో, దేశంలోనే రెండో అతి పెద్ద మెట్రో కారిడార్‌గా హైదరాబాద్‌ నిలిచింది. తొలి దశ మెట్రో ప్రాజెక్టులో ఇది చివరి దశ కావడంతో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, శనివారం నుంచి ఈ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం ఆరున్నర గంటల నుంచే జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ మార్గంలో మెట్రో పరుగులు తీయనుంది.


11 కిలోమీటర్లు.. 9 మెట్రో స్టేషన్లు

జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కిలోమీటర్ల మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గంలో సికింద్రాబాద్‌ వెస్ట్‌, కొత్త గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్‌- కోఠి, ఎంజీబీఎస్‌ ఉన్నాయి. హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాలను కలుపుతూ మెట్రో మార్గం ఆధునిక ప్రజా రవాణా వారధిగా నిలిచింది. ఈ 11 కిలోమీటర్ల మార్గంలో రోడ్డుపై ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాల్లో 40 నిమిషాలకంటే ఎక్కువ సమయం పడుతుంది. అదే మెట్రోలో అయితే 16 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. కాగా, ఎల్బీనగర్‌-మియాపూర్‌ మార్గంలో ప్రయాణించే కారిడార్‌-1కు సంబంధించిన రైళ్ల రాకపోకలు ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌ కింది అంతస్తు ద్వారా సాగుతాయి. జేబీఎస్‌-ఫలక్‌ నుమా (కారిడార్‌-2) మార్గంలో రైళ్లు పైఅంతస్తుల ద్వారా రాకపోకలు సాగిస్తాయి. ఒక మార్గం నుంచి మరో మార్గానికి మారడానికి సులభమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రిటైల్‌ అవుట్‌లెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్‌, కాన్‌కోర్స్‌ లెవెల్‌లో నిర్మించారు.


మెట్రో.. మరో 100 కిలోమీటర్లు

‘‘మెట్రో రైల్లో ప్రయాణిస్తుంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంది. నగరంలో మెట్రోను మరో 80 నుంచి 100 కిలోమీటర్లు విస్తరించాలి. ప్రస్తుతం మియాపూర్‌ వరకే ఉన్న మెట్రోను పటాన్‌చెరు వరకూ.. ఎల్బీ నగర్‌ నుంచి హయాత్‌నగర్‌ వరకూ విస్తరించాలి’’ అని సీఎం కేసీఆర్‌ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. నగరం నలుమూలల నుంచీ శంషాబాద్‌ విమానాశ్రయం వరకూ మెట్రో సౌకర్యం ఉండాలని మెట్రో అధికారులతో ప్రస్తావించారు. మెట్రో కారిడార్‌-2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. జేబీఎస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కిన కేసీఆర్‌.. ప్రయాణ సమయంలో వివిధ అంశాలపై మాట్లాడారు. మెట్రో కోచ్‌లోని సీటులో కూర్చున్న సీఎం కేసీఆర్‌ను మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి డ్రైవర్‌ కేబిన్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ.. ఎదురుగా వస్తున్న వివిధ స్టేషన్లు.. ప్రాంతాలు.. థియేటర్లు, రోడ్ల పేర్లను కేసీఆర్‌ ప్రస్తావించారు. ఇది పాత గాంధీ ఆస్పత్రి కదూ? బోయిగూడకు వచ్చినట్లున్నాం!! నారాయణగూడ శాంతి థియేటర్‌కు వచ్చేశాం. ఇమ్లిబన్‌ బస్‌ స్టేషన్‌కు వచ్చాం కదా? అంటూ ఆయన టకటకా స్థానిక ప్రాంతాల పేర్లు చెప్పడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేనా.. మెట్రోలో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి కూడా కేసీఆర్‌ ప్రస్తావించడం విశేషం. అక్కడున్న టెక్నాలజీ గురించి మాట్లాడారు. ప్రయాణ సమయంలో ఉల్లాసంగా ఉన్న ఆయన.. ఢిల్లీ మెట్రో కంటే మనదే బాగుందన్నారు. ఈసీఐఎల్‌, ఏఎ్‌సరావు నగర్‌ వంటి ప్రాంతాలకు మెట్రోను విస్తరిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని మెట్రో అధికారులతో చెప్పారు.

Updated Date - 2020-02-08T08:14:26+05:30 IST