నగరం నడిబొడ్డున వైద్యమా?

ABN , First Publish Date - 2020-03-04T09:01:40+05:30 IST

కొవిడ్‌-19కు కేంద్రస్థానమైన వూహాన్‌ నుంచి తీసుకొచ్చిన భారతీయులకు ఢిల్లీలోని ప్రధాన ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు, చికిత్స చేయించలేదు! రాజధానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో రెండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలో

నగరం నడిబొడ్డున వైద్యమా?

గాంధీలో చికిత్సపై ప్రజల్లో ఆందోళన

హైదరాబాద్‌ సిటీ, మార్చి 3(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19కు కేంద్రస్థానమైన వూహాన్‌ నుంచి తీసుకొచ్చిన భారతీయులకు ఢిల్లీలోని ప్రధాన ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు, చికిత్స చేయించలేదు! రాజధానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో రెండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అనుమానితుల విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉంటే.. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స చేసే విషయంలో మరెంతో అప్రమత్తంగా ఉండాలి. కానీ.. అందుకు భిన్నంగా హైదరాబాద్‌లో గాంధీ లాంటి అత్యంత రద్దీగా ఉండే ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. నగరానికి నడిబొడ్డున ఉండే పెద్దాసుపత్రి గాంధీ! అక్కడికి నిత్యం వేలాది మంది రోగులు వచ్చి పోతుంటారు. అలాంటిచోట కరోనా అనుమానితులను..


దాని బారిన పడిన వారిని ఉంచి చికిత్స అందజేయడం ఎంతవరకూ శ్రేయస్కర మని వారు ప్రశ్నిస్తున్నారు. అక్కడ కాకుండా ఐసోలేషన్‌ వార్డులను, క్వారంటైన్‌ను నగరానికి దూరంగా ప్రజలు తక్కువగా ఉండే చోట ఏర్పాటు చేస్తే బాగుండేదని కొందరు వైద్యులు కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. కరోనా అనుమానితులను గాంధీ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉంచారు. బాధితుడికి ఏడో అంతస్తులో చికిత్స అందిస్తున్నారు. అతణ్ని రెండో అంతస్తు నుంచి ఏడో అంతస్తుకు తరలించే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోలేదని సమాచారం. ప్రమాదకరమైన వైర్‌సతో బాధ పడుతున్న వారిని తీసుకెళ్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే బాగుండేదని అంతా అభిప్రాయపడుతున్నారు.


మరింత జాగ్రత్త అవసరం..

గాంధీలో కరోనా విభాగాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అవసరమైన మాస్కులు.. ఇతర సామగ్రిని సమకూర్చుకునే విషయంలో సన్నద్ధత సరిగా లేదన్న విమర్శ వినిపిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులకు అవసరమైన మాస్కుల లభ్యత తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.  వైద్యులు.. వైద్య సిబ్బందికి కల్పించాల్సిన వసతులు కూడా అరకొరగా ఉన్నాయన్న విమర్శ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఒక్క కేసు మాత్రమే పాజిటివ్‌గా వచ్చిందని, మున్ముందు ఈ సంఖ్య పెరిగితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు సమాధానం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-03-04T09:01:40+05:30 IST