ట్రాన్స్‌కో సిబ్బంది నిర్బంధం!

ABN , First Publish Date - 2020-07-19T07:19:54+05:30 IST

విద్యుత్తు బిల్లుల వసూలు కోసం వెళ్లిన ట్రాన్స్‌కో సిబ్బందిని.. తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌లో స్తంభానికి...

ట్రాన్స్‌కో సిబ్బంది నిర్బంధం!

విద్యుత్తు బిల్లుల వసూలు కోసం వెళ్లిన ట్రాన్స్‌కో సిబ్బందిని.. తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌లో స్తంభానికి కట్టేశారు. శనివారం బిల్‌ కలెక్టర్‌ ఏసయ్య, రవి గ్రామానికి రాగా, విద్యుత్తు సమస్యలను పరిష్కరించకుండా బిల్లులు ఎలా వసూలు చేస్తారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరఫరాలో అంతరాయం, వోల్టేజీ హెచ్చుతగ్గులతో ఇంట్లో ఉపకరణాలు కాలిపోతున్నాయని, సాయంత్రం సరఫరాలో అంతరాయం కలిగితే రాత్రంగా చీకట్లో జాగారం చేయాల్సి వస్తోందని మండిపడ్డారు. దీంతో బిల్‌ కలెక్టర్‌.. ఏఈ రాంబాబు, లైన్‌మేన్‌ నవాజ్‌లకు సమాచారం అందించారు. లైన్‌మేన్‌ వచ్చినా, ఏఈ రావడం ఆలస్యం కావడంతో తీవ్ర ఆగ్రహం చెందిన గ్రామస్థులు ఈ ముగ్గురు సిబ్బందిని  పిల్లర్‌కు తాళ్లతో కట్టేశారు. అనంతరం వచ్చిన ఏఈ రాంబాబు, ఎస్‌.ఐ మోహన్‌రెడ్డి గ్రామస్థులను సముదాయించి ఆ ముగ్గురిని రెండు గంటల అనంతరం విడిపించారు. కాగా, ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

- అల్లాదుర్గం

Updated Date - 2020-07-19T07:19:54+05:30 IST