వరంగల్‌లో మావోయిస్టు దంపతుల లొంగుబాటు
ABN , First Publish Date - 2020-12-31T03:55:48+05:30 IST
వరంగల్‌లో మావోయిస్టు దంపతుల లొంగుబాటు

చార్జర్లు, బ్యాటరీల తయారీలో దిట్ట
ఛత్తీ్‌సగఢ్ రాష్ట్ర వాసి... పలు కేసుల్లో నిందితుడు
వరంగల్ అర్బన్ క్రైం, డిసెంబరు 30: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన యాలం నరేందర్ అలియాస్ సంపత్ అతడి భార్య పోడియం దేవి అనారోగ్య కారణాలతో వరంగల్ ఇన్‌చార్జి సీపీ పి.ప్రమోద్‌కుమార్ ఎదుట బుధవారం లొంగిపోయారు. ఈసందర్భంగా వరంగల్ సీపీ కార్యాలయంలో ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్ మావోయిస్టు దంపతులను అరెస్టు చూపించి వివరాలను వెల్లడించారు. ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా అన్నారం గ్రామానికి చెందిన యాలం నరేందర్ అలియాస్ సంపత్ స్వగ్రామంలో మూడో తరగతి వరకు చదువుకున్నాడు. 2005లో మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు ఎనబోయిన కొమురయ్య ప్రసంగాలకు ఆకర్షితుడై మావోయిస్టు పార్టీలో చేరాడు. ఖమ్మం జిల్లా స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ ద్వారా అదే సంవత్సరం అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2006లో అజ్ఞాతంలో దళసభ్యుడిగా చేరి జంపన్న నాయకత్వంలో 2008 నుంచి 2010వరకు ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో పనిచేశాడు. గండ్రకోట మల్లయ్య అలియాస్ కిరణ్ పర్యవేక్షణలో వాకీటాకీలు, చార్జర్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. వీటిని రెండు రాష్ట్రాల మావోయిస్టులకు సరఫరా చేసేవాడు.
2011లో ఏరియా కమిటీ మెంబర్‌గా పనిచేస్తూ 2015 నుంచి తెలంగాణ రాష్ట్ర కమ్యూనికేషన్ ఇన్‌చార్జిగా పనిచేశాడు. పార్టీ దళసభ్యురాలైన దేవిని 2019లో వివాహం చేసుకున్నాడు. ఇప్పటివరకు నరేందర్ వెంకటాపురం- వాజేడు కమిటీ కమాండర్‌గా పని చేశాడు. యాక్షన్ టీం మెంబర్‌గా అతడు వరంగల్ అర్బన్ జిల్లాకు పలుమార్లు వచ్చివెళ్లాడు. టార్గెట్ల కోసం రెక్కీ నిర్వహించాడు. ములుగు జిల్లాకు చెందిన దేవి స్వగ్రామంలో దినసరి కూలీగా ఉండేది. వ్యవసాయ పనుల వద్ద నరేందర్‌తో పరిచయం ఏర్పడడంతో 2018లో అజ్ఞాతంలోకి వెళ్లింది. రెండు సంవత్సరాల పాటు పార్టీలో పనిచేసి నరేందర్‌ను వివాహం చేసుకుంది. కాగా నరేందర్‌పై ఆరుకు పైగా కేసులున్నాయి. 2007, 2009, 2012, 2017లో పలుచోట్ల జరిగిన మందుపాతరలు, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పార్టీ సిద్ధాంతాలు నచ్చక, ఆరోగ్యం సహకరించక ఇద్దరూ కలిసి లొంగిపోయినట్టు సీపీ వెల్లడించారు. ఇద్దరికీ సీపీ ఆర్థికసాయం అందించారు. సమావేశంలో ములుగు ఎస్పీ సంగ్రాంసింగ్ జి.పాటిల్, ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలాం పాల్గొన్నారు.