పంతం నెగ్గింది.. ప్రేమ గెలిచింది..

ABN , First Publish Date - 2020-12-26T04:57:12+05:30 IST

పంతం నెగ్గింది.. ప్రేమ గెలిచింది..

పంతం నెగ్గింది.. ప్రేమ గెలిచింది..
మహబూబాబాద్‌ శివారు అనంతాద్రిలో దండలు మార్చుకుని వివాహం చేసుకున్న దివ్య-నరేష్‌

 ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని 100కు ఫోన్‌ చేసిన యువతి..

అనంతాద్రిలో ప్రేమించిన యువకుడితోనే పెళ్లి

వద్దనుకున్న వరుడికి సైతం గంటల్లో వివాహం

మహబూబాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని 100కు కాల్‌ చేసిన యువతి కథ సుఖాంతమైంది. తాను కోరుకున్న యువకుడినే వివాహం చేసుకుంది. అలాగే తనను పెళ్లికూతురు వద్దనుకున్నందుకు సవాల్‌గా తీసుకున్నాడో ఏమో ఆ వరుడు.. పెళ్లి ఆగిన గంటల్లోనే మరో యువతిని పెళ్లాడాడు. ఇద్దరు వేర్వేరు వివాహాలతో వారి కుటుంబాల్లో ఒక రకమైన నాటకీయత చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే... 

మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి మండలం సీరోలు కాంపెల్లికి చెందిన ఎర్రగుంట సత్యనారాయణ - శైలజ దంపతుల ఏకైక కుమార్తె దివ్యను మరిపెడ మండలం గుండెపుడి వాసి యామిని కృష్ణమూర్తి - రంగమ్మ దంపతుల ఏకైక కుమారుడు రాజే్‌షకు ఇచ్చి వివాహం జరిపించేందుకు ఈనెల 24న ముహూర్తం ఖరారైంది. అయితే తాను మరొకరిని ప్రేమించానని, అతడినే పెళ్లి చేసుకుంటానని యువతి తల్లిదండ్రులకు చెప్పినా వారు వినలేదు. ఏదోలా అమ్మాయికి నచ్చజెప్పి పెళ్లి పీటల వరకు నడిపించారు. ఈ క్రమంలోనే గురువారం మరిపెడలోని ఓ ఫంక్షన్‌హాల్లో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగిపోయాయి. సరిగ్గా ముహూర్తానికి ముందు పెళ్లి  కూతురు ట్విస్టిచ్చింది. తన సెల్‌ఫోన్‌ ద్వారా 100 డయల్‌కు ఫోన్‌ చేసింది. ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా జరిపిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోదిగిన పోలీసులు కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. అయినా పెళ్లికూతురు పట్టు విడవలేదు. దీంతో పీటలపై పెళ్లి ఆగిపోయింది. 

కాగా, శుక్రవారం పెళ్లికూతురు దివ్య అనుకున్నట్టే తన పంతం నెగ్గించుకుంది. తను ప్రేమించిన కొల్లు నరే్‌షను పెళ్లి చేసుకుంది. మహబూబాబాద్‌ శివారు అనంతాద్రిలోని స్వయంభూ జగన్నాథ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సాయంత్రం దండలు మార్చుకుని వివాహం చేసుకుంది. ఇదిలా ఉండగా దివ్య వద్దనుకున్న పెళ్లికొడుకు రాజేశ్‌ ఊరికే ఉండలేదు. పీటల మీద పెళ్లి గిన కొన్ని గంటల్లోనే అదేరోజు సాయంత్రం అదే ఫంక్షన్‌హాల్లో తమ సమీప బంధువు హరితను పెళ్లాడి అందరిని అవాక్కయ్యేలా చేశాడు. ఎలాగోలా అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి.. ఇద్దరు వేర్వురు పెళ్లిలతో శుభం కార్డు వేయించుకున్నారు. 



Updated Date - 2020-12-26T04:57:12+05:30 IST