తెలంగాణలోకి మావోయిస్టులు!

ABN , First Publish Date - 2020-03-13T10:26:25+05:30 IST

గత కొంతకాలంగా పొరుగు రాష్ట్రాలకే పరిమితమైన మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించారు. మావోయిస్టుల కదలికలను గుర్తించిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమయ్యారు

తెలంగాణలోకి మావోయిస్టులు!

అప్రమత్తమైన పోలీస్‌ శాఖ

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : గత కొంతకాలంగా పొరుగు రాష్ట్రాలకే పరిమితమైన మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించారు. మావోయిస్టుల కదలికలను గుర్తించిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా సరిహద్దు జిల్లాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చత్తీ్‌సగఢ్‌ నుంచి నాలుగు మావోయిస్టు బృందాలు మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోకి  ప్రవేశించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మణుగూరు, ఏడూళ్లబయ్యారం, గుం డాల, కరకగూడెం అటవీ ప్రాంతాల్లో గత మంగళవారం కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న సమయంలో నీలాద్రిపేట గుట్ట వద్ద పోలీసులను చూసిన ఏడుగురు  మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. వారు వదిలి వెళ్లిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   పారిపోయిన మావోయిస్టులు సరిహద్దు జిల్లాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా జిల్లాల్లో కొత్త వారికి, అనుమానితులకు ఆశ్రయం కల్పించరాదని ప్రజలకు పోలీసులు సూచించారు. అనుమానిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా కొత్త వారు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ‘‘మహబూబాబాద్‌ జిల్లా సరిహద్దు గ్రామాల్లో కూంబింగ్‌ కొనసాగుతోంది. కొత్తగూడ, గంగారాం, బయ్యారం, గూడూరు మండలాల్లో అప్రమత్తంగా ఉన్నాం. వాహనాల తనిఖీ కొనసాగుతోంది. తప్పించుకున్న మావోయిస్టులకు సంబంధించి ఎవరైనా సమాచారం ఇస్తే తగు పారితోషికం   ఇస్తాం’’ అని ఎస్పీ కోటి రెడ్డి చెప్పారు.


అప్రమత్తంగా ఉండాలి

మావోయిస్టుల కదలికల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లోని టీఆర్‌ఎస్‌ నాయకులతోపాటు హిట్‌ లిస్ట్‌లో ఉన్న ఇతర పార్టీ నాయకులను పోలీసులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పర్యటనలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజాప్రతినిధులకు సూచించారు.

Updated Date - 2020-03-13T10:26:25+05:30 IST