మావోయిస్టు నేత భాస్కర్ తృటిలో తప్పించుకున్నారు: ఎస్పీ
ABN , First Publish Date - 2020-09-20T23:13:52+05:30 IST
మావోయిస్టు నేత భాస్కర్ తృటిలో తప్పించుకున్నాడని, అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని ఇన్‌ఛార్జ్ ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. మావోయిస్టులు ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని

కుమ్రం భీం: మావోయిస్టు నేత భాస్కర్ తృటిలో తప్పించుకున్నాడని, అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని ఇన్‌ఛార్జ్ ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. మావోయిస్టులు ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, నూతన రిక్రూట్‌మెంట్లతో బలపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల నుంచి మావోయిస్టులకు సహకారం లభించడం లేదని, అందుకే వారి లక్ష్యం నెరవేరడం లేదని సత్యనారాయణ చెప్పారు.
జిల్లాలోని కడంబ అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి మావోయిస్టులు, పోలీసులకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతులిద్దరూ ఛత్తీస్‌గడ్ వాసులుగా గుర్తించారు. ఒకరు బీజాపూర్‌కు చెందిన చిన్నుగా గుర్తించగా... మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలిలో రెండు తుపాకులు, కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టు పార్టీ విస్తరణే లక్ష్యంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ ఆదివాసీ గ్రామాల్లో సంచరిస్తుండగా, అతడిని పట్టుకోవడానికి పోలీసు యంత్రాంగం కార్యాచరణ రూపొందిస్తోంది. దీంతో జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు పోలీసులు, మావోయిస్టుల కదలికలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నాయి. జిల్లాలో మార్చి నుంచి మొదలైన మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఆదిలోనే వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలన్న వ్యూహంతో స్ధానిక పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ, రిజర్వ్ బలగాలు ఇప్పటికే మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా గాలింపులు జరుపుతున్నాయి. అయితే పోలీసులు వారిని పట్టుకునేందుకు ఎన్ని రకాల ఉచ్చులు పన్నుతున్నా భాస్కర్ బృందం చాకచక్యంగా తప్పించుకుంటూ గ్రామాల్లో సంచరించడాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం సవాలుగా పరిగణిస్తోంది.