కరోనా కట్టడికి మేము సైతం
ABN , First Publish Date - 2020-03-25T09:25:14+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ ప్రకటించిన సందర్భంలో పేదలకు నిత్యావసర సరుకుల సరఫరా కోసం పలువురు ప్రముఖులు ప్రభుత్వానికి విరాళాలను అందించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

సీఎంఆర్‌ఎ్‌ఫకు సత్య నాదెళ్ల సతీమణి 2 కోట్ల విరాళం..
సినీ నటుడు నితిన్ సాయం 10 లక్షలు
తెలంగాణ ఉద్యోగ జేఏసీ రూ.48 కోట్లు
పీఆర్‌టీయూ టీఎస్ రూ.16 కోట్లు
పలువురు ప్రజాప్రతినిధులు కూడా..
హైదరాబాద్/చేర్యాల/ఇల్లెందు టౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ ప్రకటించిన సందర్భంలో పేదలకు నిత్యావసర సరుకుల సరఫరా కోసం పలువురు ప్రముఖులు ప్రభుత్వానికి విరాళాలను అందించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ నాదెళ్ల.. సీఎం సహాయ నిధికి (సీఎంఆర్‌ఎఫ్) రూ.2 కోట్లు విరాళం అందించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును అనుపమ తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి అందించారు. అలాగే సినీ నటుడు నితిన్ సైతం సీఎంఆర్‌ఎ్‌ఫకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎంను కలిసి, ఈ మేరకు చెక్కును నితిన్ అందించారు.
అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి కూడా సీఎంఆర్‌ఎ్‌ఫకు రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కూడా ముందుకు వచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు, కార్మికులంతా కలిసి తమ ఒకరోజు మూలవేతనాన్ని (రూ.48 కోట్లు) సీఎంఆర్‌ఎ్‌ఫకు అందించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఉద్యోగ జేఏసీ చైర్మన్ కె.రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మమత కలిసి సీఎంకు ఈ మేరకు లేఖను అందించారు. కరోనాపై యుద్ధానికి అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ టీఎస్ కూడా ముందుకొచ్చింది. సంఘం సభ్యుల ఒక రోజు మూలవేతనాన్ని (రూ.16 కోట్లు) సీఎంఆర్‌ఎ్‌ఫకు విరాళంగా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్కును సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌కు అందించారు.
అలాగే తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం కూడా ఒకరోజు పెన్షన్‌ను విరాళంగా ఇవ్వనున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.మోహన్నారాయణ, అర్సరాజు ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా తన రెండు నెలల గౌరవ వేతనం రూ.5 లక్షలను సీఎంఆర్‌ఎ్‌ఫకు విరాళంగా ప్రకటించారు. కరోనా కట్టడికి నెల వేతనాన్ని (రూ.2.50 లక్షలు) సీఎంఆర్‌ఎ్‌ఫకు విరాళంగా ఇస్తున్నట్లు ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ప్రకటించారు. పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కూడా నెల వేతనం రూ.3,82,000ను సీఎంఆర్‌ఎ్‌ఫకు విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ నవీన్ 10 లక్షల విరాళం
రాష్ట్రంలో కరోనా నివారణ కోసం సీఎం సహాయ నిధికి ఎమ్మెల్సీ కూర్మయ్యగారి నవీన్ కుమార్ 10 లక్షల విరాళం ప్రకటించారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.
మాతో చర్చించకుండా విరాళాలెలా ప్రకటిస్తారు?
జేఏసీపై ఉద్యోగుల వేదిక మండిపాటు
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగుల జేఏసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రాతినిథ్యం వహించడం లేదని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనాపై పోరాటానికి ఉద్యోగ జేఏసీ, పీఆర్టీయూలు తమతో చర్చించ కుండా సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఏకపక్షంగా విరాళం ప్రకటించడాన్ని వేదిక తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలోని ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల అందరి ఒకరోజు మూలవేతనం రూ.45 కోట్లు దాటదని, టీఎన్జీవోలు రూ.48 కోట్లు, పీఆర్‌టీయూ రూ.23 కోట్లకు చెక్కులు ఇవ్వడం హాస్యాస్పదమని ఆక్షేపించింది.