ప్రజా సమస్యలపై జైలుకెళ్లినందుకు గర్వపడదాం

ABN , First Publish Date - 2020-10-14T07:18:23+05:30 IST

‘‘కాంగ్రెస్‌ కార్యకర్తలు అత్యాచారాలు, భూ కబ్జాలు చేసి జైళ్లకు పోవట్లేదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడి జైలుకు ..

ప్రజా సమస్యలపై జైలుకెళ్లినందుకు  గర్వపడదాం

పోరాటంలో వెనకడుగు లేదు: మణిక్కమ్‌ ఠాగూర్‌ 


హైదరాబాద్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌ కార్యకర్తలు అత్యాచారాలు, భూ కబ్జాలు చేసి జైళ్లకు పోవట్లేదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడి జైలుకు వెళ్తున్నారు. ఇందుకు మనం గర్వపడాలి’’ అని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌ అన్నారు. అధికార పార్టీ వాళ్లు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగు వేసేది లేదన్నారు. రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, అన్ని కేసులనూ ఎత్తివేయించేద్దామని చెప్పారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలను నిరసిస్తూ ఇటీవల హోంమంత్రి నివాసం వద్ద ధర్నా చేసి అరెస్టయిన 68 మంది కాంగ్రెస్‌ నేతలతో ఇందిరా భవన్‌లో ఠాగూర్‌ సమావేశమయ్యారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై పోరాటంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర పోలీసులు కల్వకుంట్ల ప్రైవేట్‌ సైన్యంలా తయారయ్యారని ఆరోపించారు.  


నిరుద్యోగులను పట్టించుకోండి: సంపత్‌ కుమార్‌

సీఎం కేసీఆర్‌ కుటుంబంలోని రాజకీయ నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిందని, ఇప్పటికైనా రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యను పట్టించుకోవాలని కోరుతూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. 16 నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో కవిత ఎంత మానసిక వేదనకు గురయ్యారో అందరికీ తెలిసిందేనని, అలాంటిది 66 నెలలుగా అలాంటి వేదన అనుభవిస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల గురించి ఇప్పటికైనా ఆలోచించాలన్నారు. 

Updated Date - 2020-10-14T07:18:23+05:30 IST