ఒకరిని చంపబోయి.. మరొకరిని చంపేశారు

ABN , First Publish Date - 2020-09-29T07:23:06+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడి డబ్బు విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం.. మరో అమాయకుడి ప్రాణాలను బలి తీసుకుంది. తన డబ్బును తిరిగి ఇవ్వనన్నందుకు యజమానిని హత్య చేయాలని కుట్ర పన్నగా.. దుండగులు అతడే అనుకొని అతడి అసిస్టెంట్‌ను చంపారు. నగర శివారులోని బాలాపూర్‌ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును

ఒకరిని చంపబోయి.. మరొకరిని చంపేశారు

  • రియల్టర్‌ను హతమార్చేందుకు కుట్ర
  • అదే రంగు షర్టు వేసుకున్న అసిస్టెంట్‌ బలి
  • ఐదుగురు నిందితుల అరెస్టు


కొత్తపేట, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడి డబ్బు విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం.. మరో అమాయకుడి ప్రాణాలను బలి తీసుకుంది. తన డబ్బును తిరిగి ఇవ్వనన్నందుకు యజమానిని హత్య చేయాలని కుట్ర పన్నగా.. దుండగులు అతడే అనుకొని అతడి అసిస్టెంట్‌ను చంపారు. నగర శివారులోని బాలాపూర్‌ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఎల్‌బీనగర్‌ జోన్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ సోమవారం సీపీ క్యాంపు కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు.  బాలాపూర్‌ పరిధిలో వాది-ఎ-ముస్తఫా కాలనీలో నివాసముండే మహ్మద్‌ ఫర్హాన్‌ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన స్నేహితుడు, ఇంజనీరింగ్‌ విద్యార్థి మహమ్మద్‌ పర్వేజ్‌(21) కొన్నాళ్ల క్రితం ఈ వ్యాపారంలో పెట్టుబడి కోసం అతడికి రూ.9 లక్షలు ఇచ్చాడు. తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరగడంతో డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరాడు. అయితే ఫర్హాన్‌ డబ్బులివ్వకపోగా.. బెదిరించాడు. అతడు తనను చంపేస్తాడేమోనని భావించిన పర్వేజ్‌.. ఆసి్‌ఫనగర్‌కు చెందిన దూరపు బంధువు, ఇంటర్‌ విద్యార్థి, పాత నేరస్తుడు షేక్‌ ఉస్మాన్‌ అలియాస్‌ సైఫ్‌ (20)ను ఆశ్రయించాడు. ఫర్హాన్‌ను చంపితే రూ.2 లక్షలు ఇస్తానన్నాడు. సైఫ్‌ తన స్నేహితులు, పాత నేరుస్తులు గోల్కొండ, బంజారా దర్వాజా వాసి, ఎలక్ట్రీషియన్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అలియాస్‌ మహ్మద్‌ మజ్హర్‌(19), ఆసి్‌ఫనగర్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్థి మీర్‌ రషీద్‌ అలీ(19), రాజేంద్రనగర్‌ హసన్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ అక్రమ్‌(22)లతో కలిసి హత్య చేస్తానన్నాడు. ఆపై ఫర్హాన్‌ కదలికలను పర్వేజ్‌ ఎప్పటికప్పుడు సైఫ్‌కు తెలియజేయగా, మిగతా ముగ్గురు అతని ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. 


తెల్ల షర్టు, అదే బైకుపై రావడంతో..

ఈ నెల 22న అర్ధరాత్రి తెల్ల షర్టు వేసుకున్న ఫర్హాన్‌ బైక్‌పై బయటకు వెళ్తున్నాడని సైఫ్‌కు పర్వేజ్‌ సమాచారం ఇచ్చాడు. సైఫ్‌ తన గ్యాంగ్‌తో కలిసి కాలనీలో కాపు కాశాడు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఫర్హాన్‌కు బదులు అతడి వద్ద పనిచేసే సయ్యద్‌ మోయిన్‌ అలీ(24), ఖాలిద్‌ కలిసి అదే బైకుపై బయటకు వచ్చారు. మోయిన్‌ కూడా తెల్ల షర్టే వేసుకోవడం, ఆ ప్రాంతంలో కాస్త మసక వెలుతురు ఉండడంతో ఫర్హాన్‌గా భావించి దుండగులు అతనిపై కత్తులతో దాడి చేశారు. ఖాలిద్‌ భయంతో పారిపోయాడు. మోయిన్‌ను విచక్షణా రహితంగా పొడిచి బైకులపై పరారయ్యారు. మోయిన్‌ తల్లి షాహీన్‌ బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీల సాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించారు. పోలీసులు వారి నుంచిమూడు బైకులు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు.  మోయిన్‌ను హత్య చేసిన తర్వాత సైఫ్‌, మజ్హర్‌లు రాయదుర్గం, బేగంబజార్‌లలో సెల్‌ఫోన్లు దొంగిలించారని డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ చెప్పారు. 

Updated Date - 2020-09-29T07:23:06+05:30 IST