ప్రాజెక్టులు కాంగ్రెస్‌ కట్టినవే

ABN , First Publish Date - 2020-06-06T09:07:12+05:30 IST

కాంగ్రెస్‌ హయాంలో కట్టిన ప్రాజెక్టులే తప్ప, సీఎం కేసీఆర్‌ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేకపోయారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.

ప్రాజెక్టులు కాంగ్రెస్‌ కట్టినవే

కేసీఆర్‌ ఒక్కటీ నిర్మించలేదు: భట్టి 


ఖమ్మం రూరల్‌/హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి) జూన్‌ 5 : కాంగ్రెస్‌ హయాంలో కట్టిన ప్రాజెక్టులే తప్ప, సీఎం కేసీఆర్‌ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేకపోయారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం గోళ్లపాడులో శుక్రవారం ఆయన సాగునీటి ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణకు రాజకీయాలకతీతంగా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. జల దోపిడీపై దీక్షలు చేస్తుంటే, వాస్తవాలు ఎక్కడ బయటపడతాయోనని వాటిని అడ్డుకుని, కాంగ్రెస్‌ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర హోం మంత్రి పేరుకే ఉన్నారని.. పెత్తనమంతా డీజీపీ మహేందర్‌రెడ్డి చేస్తున్నారని మాజీ ఎంపీ వి.హన్మంతరావు ధ్వజమెత్తారు.


గాంధీభవన్‌లో వీహెచ్‌ మాట్లాడుతూ ప్రతిపక్షాలపైన రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటోందన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన పోలీసులంతా ఇప్పుడు మంచి పోస్టులో ఉన్నారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాల నేతలు స్వామిగౌడ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, దేవీప్రసాద్‌లకు పదవులు ఇచ్చిన సీఎం కేసీఆర్‌.. ఉద్యోగులను మాత్రం పట్టించుకోవట్లేదని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి విమర్శించారు.

Updated Date - 2020-06-06T09:07:12+05:30 IST