సర్వే సెటిల్మెంట్ పూర్తి కాకుండా..‘నాలా’ హక్కులిస్తే రెండో తప్పే
ABN , First Publish Date - 2020-10-14T06:53:13+05:30 IST
భూముల సర్వే సెటిల్మెంట్లు పూర్తి కాకుండా ‘ధరణి’ పోర్టల్ ద్వారా ల్యాండ్ కన్వర్షన్ పట్టాలిస్తే రెండోసారి తప్పు ..

‘ధరణి’లో అన్నీ లోపాలే: భట్టి
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): భూముల సర్వే సెటిల్మెంట్లు పూర్తి కాకుండా ‘ధరణి’ పోర్టల్ ద్వారా ల్యాండ్ కన్వర్షన్ పట్టాలిస్తే రెండోసారి తప్పు చేసినట్లవుతుందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ ఫర్ నాన్-అగ్రికల్చరల్ పర్పసెస్ - నాలా(అమెండ్మెంట్) బిల్-2020’, ‘ఇండియన్ స్టాంప్ యాక్ట్-1899(సవరణ) బిల్లు-2020’లపై మంగళవారం శాసన సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. భూమార్పిడి(ల్యాండ్ కన్వర్షన్) పట్టాలను ఇక నుంచి ధరణి పోర్టల్ ద్వారానే జారీ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ ధరణిలో పొందుపర్చిన భూవివరాలే సమగ్రంగా లేవని ఆరోపించారు. ధరణిలో తప్పుడు భూవివరాలను ఎంట్రీ చేశారంటున్నారని, అప్పుడే అసలు తప్పు జరిగిందన్నారు. ధరణిలోని వివరాలను సరిదిద్దకుండా నాలా సవరణ చట్టాన్ని ఎలా అమలు చేస్తారని నిలదీశారు. రాష్ట్రంలోని భూముల వివరాలన్నింటినీ సర్వే చేసి, సెటిల్ చేస్తామని సీఎం ఇదే సభలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
కాగా.. ఇండియన్ స్టాంపు యాక్ట్-1899లోని సెక్షన్ 47(ఎ) సవరణను స్వాగతిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. స్టాంపు యాక్ట్‌లో రిజిస్ట్రేషన్ల అధికారులకున్న విచక్షణాధికారాలను తొలగించే సవరణ ఎన్ఆర్ఐలు, పట్టణాలకు వెళ్లి నివసించే భూయజమానులు, భూవివాదాల్లో చిక్కుకున్నవారికి ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నాలా కన్వర్షన్లు జరగకుండానే కాలనీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఇలాంటి వాటిని సరిదిద్దాలని కోరారు.
సభ ప్రజల కోసం కాదు.. ప్రభుత్వం కోసమే
ప్రభుత్వానికి కావాల్సిన బిల్లులను పాస్ చేయించుకునేందుకే శాసనసభ సమావేశాన్ని హడావుడిగా ఏర్పాటు చేశారని భట్టి విమర్శించారు. శాసనసభ నిరవధిక వాయిదా అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్కలతో కలిసి ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు సీఎం భరోసా ఇవ్వడం లేదని సీతక్క విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళా కమిషన్ లేదని, మహిళలపై దాడులు జరిగినప్పుడు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు.