తమిళనాడు అసెంబ్లీ పోరులో మజ్లిస్!
ABN , First Publish Date - 2020-12-15T08:31:08+05:30 IST
హైదరాబాద్‌లో పురుడుపోసుకుని.. అంచెలంచెలుగా ఇతర రాష్ట్రాల్లో పాగావేస్తూ జాతీయ పార్టీగా ఎదుగుతున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఇప్పుడు తమిళనాడు ఎన్నికలపై దృష్టి పెట్టింది.

కమల్‌హాసన్‌తో కలిసి పోటీ
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో పురుడుపోసుకుని.. అంచెలంచెలుగా ఇతర రాష్ట్రాల్లో పాగావేస్తూ జాతీయ పార్టీగా ఎదుగుతున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఇప్పుడు తమిళనాడు ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇటీవలే బిహార్‌లో ఐదు స్థానాలల్లో పాగా వేసిన ఆ పార్టీకి మహారాష్ట్రలో ఇద్దరు శాసన సభ్యులు ఉన్నారు.
వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించిన ఆ పార్టీ.. ఇప్పుడు తమిళనాట సినీ హీరో కమల్‌హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం పార్టీతో పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అంతర్గతంగా సమాలోచనలు జరుగుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తమిళనాడులో ముస్లింలకు సంబంధించిన ఇండియన్ ముస్లింలీగ్, ఇండియన్ నేషనల్ లీగ్, మనితనేయ మక్కల్ కచ్చి, మనితనేయ జననాయగ కచ్చి, ఆలిండియా ముస్లిం లీగ్, తమిళనాడు తోహిద్-జమాత్ వంటి చిన్నచిన్న రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుని.. కమల్‌హాసన్ నేతృత్వంలోని ఎంఎన్‌ఎంతో కలిసి.. 25 స్థానాల్లో పోటీకి అసదుద్దీన్ ప్రతిపాదించినట్లు తెలిసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. తమిళనాడు జనాభాలో 5.86ు మంది ముస్లింలు ఉన్నారు.
ఎన్నికల బరిలోకి హీరో విశాల్!
తమిళ హీరో విశాల్ రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఆయన నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా.. తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి, తన భవిష్యత్ ను నిర్ణయించుకోనున్నట్లు ప్రకటించారు.
చెన్నై నుంచే ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? ఏ పార్టీ తరఫున బరిలో నిలుస్తారు? అనే ప్రశ్నలకు త్వరలో అధికారికంగా సమాధానమిస్తానని విశాల్ తెలిపారు.