మక్కల కొనుగోలు కేంద్రాలేవీ..?

ABN , First Publish Date - 2020-11-06T05:56:43+05:30 IST

మొక్కజొన్నలకు మార్కెట్లో మద్దతు ధర కరువైంది. ప్రభుత్వం ప్రకటించిన ధరకంటే వ్యాపారులు తక్కువ రేటుకు ఖరీదు చేస్తుండడంతో రైతులు నష్ట పోతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవ

మక్కల కొనుగోలు కేంద్రాలేవీ..?

 మార్కెట్‌లో మద్దతు ధర కరువు

 ఆందోళనలో రైతులు 


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, నవంబరు 5 : మొక్కజొన్నలకు మార్కెట్లో మద్దతు ధర కరువైంది. ప్రభుత్వం ప్రకటించిన ధరకంటే వ్యాపారులు తక్కువ రేటుకు ఖరీదు చేస్తుండడంతో రైతులు నష్ట పోతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవ డంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.  


మక్కలకు మద్దతు ఏది..

జిల్లాలోని మహబూబాబాద్‌, కేసముద్రం మార్కెట్లలో  పదిహే ను రోజుల క్రితం వరకు మొక్కజొన్నలు క్వింటాకు రూ.1000 నుంచి రూ.1326 ధరలు పలికాయి. అధికంగా రూ.1280 వరకే వ్యాపారులు ఖరీదు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 1850 ఉన్నప్పటికీ తక్కువ ధరకే వ్యాపారులు ఖరీదు చేస్తున్నారు. మక్కల ధర తగ్గడంతో వివిధ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగడం తో రాష్ట్ర ప్రభుత్వం  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో వ్యాపారులు మొక్కజొన్నలకు కొంత మేర ధర లు పెంచారు. ప్రస్తుతం మానుకోట మార్కెట్‌లో రూ.1076 నుంచి రూ.1466 వరకు ధర పలుకుతుండగా కేసముద్రం మార్కెట్‌లో రూ.1086 నుంచి రూ.1530 వరకు పలుకుతున్నాయి. అయినప్పటికీ జిల్లాలో మార్క్‌ఫెడ్‌ అధికారులు ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 


విక్రయాలు పూర్తికావడానికి వచ్చినా..

 పంటలు పూర్తి కావడంతో 20 రోజుల నుంచి రైతులు మక్కలను మార్కెట్లకు తీసుకువస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. సుమారుగా మక్కలు మొత్తం విక్రయాలు పూర్తి కావచ్చాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో రైతుల ఒరిగేదేమి లేదు. జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేస్తారన్న విషయంలో కూడా స్పష్టత లేదు. వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2020-11-06T05:56:43+05:30 IST