విజయశాంతికి నేతలపైనే అసంతృప్తి..పార్టీపై కాదు: మధుయాష్కి

ABN , First Publish Date - 2020-11-07T19:55:19+05:30 IST

టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి సేవలను వినియోగించుకోకపోవడం..

విజయశాంతికి నేతలపైనే అసంతృప్తి..పార్టీపై కాదు: మధుయాష్కి

హైదరాబాద్: టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి సేవలను వినియోగించుకోకపోవడం రాష్ట్ర నాయకత్వ లోపమేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కి అన్నారు. విజయశాంతికి నేతలపైనే అసంతృప్తి ఉందని, కాంగ్రెస్ పార్టీపై లేదన్నారు. దుబ్బాక ఫలితాల తర్వాత రాష్ట్ర నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ఇన్చార్జ్ ఇచ్చే నివేదిక ఆధారంగానే టీపీసీసీపై మార్పు నిర్ణయం ఉంటుందన్నారు. 


ఈ సందర్భంగా మధుయాష్కి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ విజయశాంతి పార్టీ వీడతారనేది ఆందోళన కలిగించే విషయమన్నారు. దీనిపై సోనియాగాంధీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్‌తో మాట్లాడి పరిష్కరించాలని సూచించారన్నారు. పార్టీలో విజయశాంతి సీనియర్ నాయకురాలని, ప్రజాభిమానం పొందిన వ్యక్తి అని అన్నారు. సోనియాగాంధీ అంటే ఆమెకు చాలా అభిమానమని, గౌరవమని తెలిపారు. సోనియాపై ఉన్న గౌరవంతోనే విజయశాంతి టీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరారన్నారు. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం లోపం కూడా ఉంద్నారు. సరైన విధంగా ఆమె సేవలను ఉపయోగించుకోలేదన్నారు. విజయశాంతి పార్టీ వీడరని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని మధుయాష్కి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-11-07T19:55:19+05:30 IST