లాక్‌ డౌన్‌ బేఖాతరు!

ABN , First Publish Date - 2020-03-24T09:14:09+05:30 IST

ప్రపంచాన్ని గడగలాడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు మాత్రం అవేమీ పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు.

లాక్‌ డౌన్‌ బేఖాతరు!

మొదటి రోజే కట్టు తప్పిన ప్రజలు.. రాత్రంతా కర్ఫ్యూకు సర్కారు ఆదేశం

సాధారణ రోజుల్లానే రహదారులపై రద్దీ

ఆగని ప్రయాణాలు.. వీధుల్లోకి వచ్చిన జనం

కరోనా పిడికిలిలో భారత్‌

20 రాష్ట్రాలు లాక్‌డౌన్‌.. ఆరు చోట్ల కర్ఫ్యూ

ఇక వారానికి ఒక్కరోజే సుప్రీం కోర్టు పని

అత్యవసర కేసులు వీడియో కాన్ఫరెన్స్‌లో


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ప్రపంచాన్ని గడగలాడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు మాత్రం అవేమీ పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూకి సహకరించిన ప్రజలు.. లాక్‌డౌన్‌ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. నిర్మల్‌ జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాహనాలు యథావిధిగా తిరిగాయి. జగిత్యాల జిల్లాలోనూ లాక్‌డౌన్‌ సరిగా అమలు కాలేదు. హోటళ్లు, టీ కొట్లు, చికెన్‌ సెంటర్లు, కిరాణ షాపులు అన్నీ తెరిచి ఉంచారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ను ప్రజలు పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఉదయమే పెద్ద సంఖ్యలో రోడ్ల మీదికి వచ్చారు. అయితే మధ్యాహ్నంనుంచి డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడి వాహనాలను అక్కడే ఆపివేశారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో డొమెస్టిక్‌ విమాన సర్వీసుల కోసం ప్రజలు బారులు తీరారు.


విజయవాడ హైవే పై రద్దీ

జాతీయ రహదారులపై సోమవారం వాహనాల రద్దీ నెలకొంది. యాదాద్రిభువనగిరి జిల్లాలోని హైదరాబాద్‌- విజయవాడ, భూపాలపట్నం- హైదరాబాద్‌ జాతీయ రహదారులపై ఆర్టీసీ బస్సులు మినహా ఇతర అన్ని రకాల వాహనాలు బారులు తీరాయి. దీంతో రాచకొండ కమిషనరేట్‌ భువనగిరి జోన్‌ డీసీపీ కె.నారాయణరెడ్డి జిల్లాలోని బీబీనగర్‌ వద్ద గల గూడూరు, చౌటుప్పల్‌ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నిలిపివేశారు.


రెండు మూడు గంటల పాటు అక్కడే నిలిపేసిన అనంతరం కౌన్సిలింగ్‌ ఇచ్చి లాక్‌డౌన్‌ను తప్పకుండా పాటించాలని వివరించి గమ్యస్థానాలకు పంపించారు. రాష్ట్ర సరిహద్దు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం నుంచి వాహనాల రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. విజయవాడ వైపు వెళ్లేందుకు అనుమతించాలని వాహనదారులు పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పోలీసులు వారిని పంపించారు. 


పాలమూరులో రోడ్లపైకి భారీగా జనం

 ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రభావం స్వల్పంగానే కనిపించింది. ప్రజలంతా ఎప్పట్లానే వాహనాలతో తిరిగారు. ఆటోలు కూడా రోడ్లమీదకు వచ్చాయి. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తమై ఎక్కడికక్కడ చర్యల వేగం పెంచారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణానది సరిహద్దు గ్రామాల వద్ద ఏపీ లోని నందికొట్కూరు ప్రాంతం నుంచి పడవలు, పుట్టీల ద్వారా రవాణా మాత్రం సోమవారం యథావిధిగా నడిచింది. జనగామ జిల్లాలోనూ లాక్‌డౌన్‌ పాక్షికంగానే అమలైంది. ఖమ్మం, భద్రాద్రి-కొత్త గూడెం జిల్లాల్లో లాక్‌డౌన్‌కు మిశ్రమ స్పందన కనిపించింది. ఖమ్మంలో ప్రజలు రోజువారీ కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొన్నారు.. సిద్దిపేట జిల్లా చేర్యాలలోనూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వారిని పోలీసులు వెనక్కి పంపించారు.


భాగ్యనగరంలోనూ అదే తీరు

హైదరాబాద్‌ నగరంలోనూ సోమవారం ఉదయం భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు.. మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, గచ్చిబౌలి, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్‌ పెరిగింది .సాధారణ రోజుల తరహాలోనే రోడ్లపై వాహనాల రాకపోకలు. నిత్యావసరాల కొనుగోలు పేరిట పౌరులు ఇష్టానికి బయటకు వచ్చారు. ఆటోలు, క్యాబ్‌లు తిరిగాయి. ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ జామ్‌ కూడా కనిపించింది. వాహనాల రాకపోకలపై ఆంక్షలు లేకపోవడంతో పౌరులు ఇష్టానికి ప్రయాణించారు.


మధ్యాహ్నంనుంచి మారిన సీన్‌

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి విలేకరుల సమావేశం అనంతరం పరిస్థితి మారింది. పోలీసు వ్యవస్థ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. లాక్‌డౌన్‌ సమయంలో బయటకు వచ్చినందుకు శిక్ష అంటు.. సిగ్నళ్ల వద్ద అన్ని వైపుల రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో కొన్ని సిగ్నళ్ల వద్ద దాదాపు అర కిలోమీటర్‌కుపైగా వాహనాలు నిలిచిపోయాయి. కాగా ఏపీలో లాక్‌డౌన్‌ పాక్షికంగా జరిగింది.


కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు కోపం వచ్చింది.. 

సిరిసిల్ల: లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ  రోడ్లపై ఎక్కువగా కనిపించడం, బైక్‌లు, కార్లలో వెళ్లడం, గుమిగూడి ఉండడం వంటి పరిణామాలు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు ఆగ్రహం తెప్పించాయి. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట రహదారి వెంట స్వయంగా తిరుగుతూ వాహనాలను ఆపారు. లాక్‌డౌన్‌ ప్రకటించినా బాధ్యత లేకుండా రోడ్లపైకి రావడం ఏమిటని ప్రశ్నించారు. ఆదేశాలు బేఖాతరు చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


పరిస్థితి తీవ్రంగా ఉంది

లాక్‌డౌన్‌ను చాలా మంది ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. దయచేసి మిమ్మల్ని  మీరు కాపాడుకోండి. మీ కుటుంబాల్ని కాపాడుకోండి. పరిస్థితి తీవ్రంగా ఉంది.  దీనిని అందరూ సీరియస్‌గా తీసుకోవాలి. కేంద్రం ఇచ్చిన సూచనలు, డాక్టర్లు ఇస్తున్న హెచ్చరికలను పాటించండి. నిబంధనలు, చట్టాలు తప్పనిసరిగా అమలు చేసేలా రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.  

 ప్రధాని మోదీ

Read more