లాక్‌డౌన్‌.. పొడిగింపు!

ABN , First Publish Date - 2020-04-05T08:00:06+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించనున్నారా!? ఏప్రిల్‌ 14వ తేదీ తర్వాత కూడా మరో వారం రోజులపాటు ఇది కొనసాగే అవకాశం ఉందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ...

లాక్‌డౌన్‌.. పొడిగింపు!

  • మరో వారం పొడిగించే చాన్స్‌
  • మర్కజ్‌ లింకులే కారణం
  • పునరాలోచనలో కేంద్ర ప్రభుత్వం
  • మూడు నాలుగు రోజులుగా 
  • పెరుగుతున్న మర్కజ్‌ కేసులు
  • దేశవ్యాప్తంగా రోజూ 500పైనే
  • వాటిలో అత్యధికం తబ్లీగీ బంధమే
  • మరిన్ని పెరిగేందుకూ అవకాశం
  • లాక్‌ డౌన్‌ కొనసాగిస్తేనే కట్టడి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించనున్నారా!? ఏప్రిల్‌ 14వ తేదీ తర్వాత కూడా మరో వారం రోజులపాటు ఇది కొనసాగే అవకాశం ఉందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. లాక్‌డౌన్‌ పొడిగింపు దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని చెబుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా తెరపైకి వచ్చిన తబ్లీగీ జమాత్‌ ఘటనే ఇందుకు కారణమని వివరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనాను అరికట్టడమే ధ్యేయంగా మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత 24వ తేదీ నుంచి లాక్‌ డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 14వ తేదీ అర్ధరాత్రి వరకూ ఈ లాక్‌ డౌన్‌ కొనసాగుతుందని కూడా ప్రకటించారు.


దీనికితోడు, జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపి వేశారు. ఫలితంగా లాక్‌ డౌన్‌ కారణంగా సానుకూల ఫలితాలూ వచ్చాయి. విదేశాల నుంచి వచ్చే వారి ద్వారా కరోనా సోకే కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దాంతో, లాక్‌ డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తే, ఏప్రిల్‌ తొమ్మిదో తేదీ నాటికి కొత్త కేసులు తగ్గిపోతాయని, రెండో దశ ప్రారంభంలోనే కరోనాను నిలువరించినట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అదే జరిగితే, ఏప్రిల్‌ 15వ తేదీన లాక్‌ డౌన్‌ను ఎత్తి వేయవచ్చని కూడా భావించింది. అయితే, అనూహ్యంగా ఢిల్లీలో మర్కజ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏదో ఒకటి రెండు రాష్ట్రాలకు పరిమితం కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ మర్కజ్‌ లింకులు బయట పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో నమోదవుతున్న కొత్త కేసులన్నీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు, వారి సన్నిహితులకే సోకుతున్నాయి. తబ్లీగీ జమాత్‌ సమావేశానికి హాజరైనవారు, వారిని కలిసిన వారు కలిపి 22 వేల మందికిపైగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో వీరు ఉన్నారని అంచనా వేసింది. వారిలో ఇప్పటి వరకూ 1023 మందికి కరోనా పాజిటివ్‌ రాగా.. మిగిలిన వారంతా క్వారంటైన్‌లో, ఐసొలేషన్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో తబ్లీగీ జమాత్‌కు సంబంధించిన వారే 30 శాతం ఉన్నారని ప్రకటించింది. ఈ నేపథ్యంలో, రాబోయే కొద్ది రోజుల్లోనే మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారికి సంబంధించి మరిన్ని పాజిటివ్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వారి నుంచి ఎంత మందికి వైరస్‌ సోకిందనే అంశంపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు.


ఈ లెక్కలన్నీ పక్కాగా తేలే వరకూ లాక్‌ డౌన్‌ను ఎత్తి వేసే అవకాశాలు కనిపించడం లేదు. గత మూడు నాలుగు రోజులుగా ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 400కుపైగా పాజటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో నమోదవుతున్న కొత్త కేసులన్నీ తబ్లీగీ జమాత్‌కు చెందినవే. ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్న కొత్త కేసుల్లోనూ వీటికి సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. ఇక, మరణాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే, రాబోయే కొద్ది రోజులపాటు కూడా మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారికి సంబంధించి పాజటివ్‌ కేసులు పెరిగే అవకాశం ఉండవచ్చని కేంద్రం అంచనా వేస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరోనాను పూర్తిగా నిలువరించాలంటే లాక్‌ డౌన్‌ను పొడిగించడమే మార్గమని కేంద్రం భావిస్తోందని వివరించాయి.

Updated Date - 2020-04-05T08:00:06+05:30 IST