లాక్‌డౌన్ అత్యంత అరుదైన చర్య
ABN , First Publish Date - 2020-03-24T09:33:17+05:30 IST
కరోనా వైరస్ అంతమయ్యే వరకు స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. లాక్‌డౌన్

స్వీయ నియంత్రణ పాటించండి: కేటీఆర్
రాత్రి 7 -ఉదయం 6 దాకా కర్ఫ్యూ: సీఎస్
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు: డీజీపీ
పరిస్థితిని అర్థం చేసుకోవాలి : కేటీఆర్
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ అంతమయ్యే వరకు స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ అనేది అత్యంత అరుదైన చర్య అని తెలిపారు. ప్రభుత్వం అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పరిస్థితిని అర్థం చేసుకోవాలని కరోనా వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించే వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ‘నువ్వు బతకడానికి, తోటి వారికి బతికే అవకాశం ఇవ్వడానికి, ఈ వైరస్ అంతమయ్యేదాకా స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందే’అని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమవ్వాలని, అదొక్కటే కరోనా వైరస్‌పై పోరాడే ఏకైక మార్గమని టీఆర్‌ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతో్‌షకుమార్ పేర్కొన్నారు.
సేఫ్‌హ్యాండ్స్ చాలెంజ్ స్వీకరించిన కేటీఆర్!
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన సేఫ్‌హ్యాండ్స్ చాలెంజ్‌ను కేటీఆర్ స్వీకరించారు. సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇచ్చిన చాలెంజ్‌ను కేటీఆర్ ఆచరణలో పెట్టారు. చేతుల్ని పూర్తిగా ఎలా శుభ్రం చేసుకోవాలో వివరిస్తూ ఒక వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, తదితరులను ఈ చాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా కేటీఆర్ నామినేట్ చేశారు.