జిల్లాలో లాక్‌ డౌన్‌ చేశాం..

ABN , First Publish Date - 2020-03-24T08:39:15+05:30 IST

జిల్లాలో లాక్‌ డౌన్‌ చేశామని కలెక్టర్‌ ఎం.హరిత అధికారులు, ప్రజలకు తెలిపారు. సోమవారం హన్మకొండ కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని ఆయా

జిల్లాలో లాక్‌ డౌన్‌ చేశాం..

జనం ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దు

కరోనా కట్టడికి సహకరించాలి

ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించే వారిపై కేసులు నమోదు 

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఎం.హరిత


వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌, మార్చి23: జిల్లాలో లాక్‌ డౌన్‌ చేశామని కలెక్టర్‌ ఎం.హరిత అధికారులు, ప్రజలకు తెలిపారు. సోమవారం హన్మకొండ కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని ఆయా శాఖల మండల అధికారులతో కలెక్టర్‌ కరోనా వైరస్‌ నియంత్రణ, తెలంగాణ లాక్‌ డౌన్‌ నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న పలు కీలకమైన నిర్ణయాలను ప్రజలందరు తప్పనిసరిగా పాటించాలన్నారు.


జిల్లాలో ప్రైవేటు సంస్థలు, బార్లు, మద్యం షాపులు, బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ఇతర వాహనాలు ఏవీ నడపకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు నిత్యావసరమైన వైద్యం ఆరోగ్యం, నీటి సరఫరా, కిరాణం, పెట్రోల్‌ పంపులు, మురుగునీరు పారుదల, విద్యుత్‌ యథావిధంగా నడుస్తాయని తెలిపారు. పాలు, కూరగాయలు వంటి ప్రజలకు నిత్యావసరమైన షాపులు తెరిచి ఉండేలా చూడాలని కలెక్టర్‌ అన్నారు. 


జిల్లాలోని రెవెన్యూ, మెడికల్‌, పోలీసు, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫైర్‌, సవిల్‌సఫ్లై యథావిధిగా విధులకు హాజరు కావాలన్నారు. జిల్లాలోని 401 గ్రామాలకు సంబంధించిన సర్పంచ్‌, వీఆర్వో, ఎంపీడీవోలు గ్రామాల్లోని ఆర్‌ఎంపీలు, మెడికల్‌ షాపుల వివరాలతో కూడిన మొబైల్‌ నెంబర్లను దగ్గర ఉంచుకొని ఎప్పటికప్పుడు కరోనా వైరస్‌ నివారణపై ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావాలని కోరారు. గ్రామాలకు ఎవరైనా కొత్త వారు వచ్చినా వెంటనే అధికారులకు సమాచారం చేరవేయాలన్నారు.


డివిజన్‌కో క్వారంటైన్‌..

కరోనా వైరస్‌ నివారణకు విదేశాల నుంచి వచ్చిన 79మందిని జిల్లాలోని నర్సంపేట బిట్స్‌ కళాశాల, పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ హాస్టల్‌, వర్ధన్నపేట ఆశ్రమ పాఠశాలల్లో డివిజన్ల క్వారంటైన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారు ఉపయోగించిన వస్తువులను ఇతరులు ఉపయోగించకుండా చర్యలు చేపట్టాలన్నారు. విదేశీయుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆర్‌ఆర్‌టీలు పరిశీలించాలన్నారు.


ప్రజలు గుంపులుగా ఉండకుండా చూడాలి..

జిల్లాలో ప్రజలు సమూహాలు, గుంపులు గుంపులుగా ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ప్రజలు అత్యవసరమైతే తప్ప వాహనాలపై బయట తిరగకుండా చర్యలను చేపట్టాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలని కోరారు.


ఇతర రాష్ట్రాల వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచాలి..

జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వెంటనే వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ తెలిపారు. వారికి కరోనా వైర్‌సకు సంబంధించిన జాగ్రత్తలను వివరిస్తూ కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జేసీ మహేందర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మధుసూదన్‌, తదితర అధికారులు పాల్గొన్నారు.


జిల్లాలో కరోనా కేసులు లేవు..ఆర్‌ఆర్‌టీ ఇన్‌చార్జి వితిన్‌కుమార్‌

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌: జిల్లాలో కరోనా కేసులు లేవని  ర్యాపిడ్‌ రెస్పాన్స్‌డ్‌ రెస్క్యూ టీం (ఆర్‌ఆర్‌టీ) ఇన్‌చార్జి వితిన్‌కుమార్‌ డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.  విదేశాల నుంచి దామెర మండలం కొగిల్వాయి గ్రామానికి చెందిన ఎండి ఖదీర్‌ సౌదీ అరేబియా నుంచి వచ్చాడని, ఇతర రాష్ట్రాల నుంచి 43మంది జిల్లాకు వచ్చారని వారికి ఆయా మండలాల పరిధిలో ఆర్‌ఆర్‌టీం సభ్యులు వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారు 98మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 581మంది ఉన్నారని తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో మూడు క్వారెంటైన్స్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నర్సంపేటలోని బిట్స్‌ కళాశాలలో 10 పడకల సెంటర్‌, వర్ధన్నపేటలోని ఆశ్రమ పాఠశాలలో 60పడకల సెంటర్‌, పరకాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ హాస్టల్‌లో 10పడకల సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌వో మధుసూదన్‌, ఆర్‌ఆర్‌టీ ఇన్‌చార్జి వితిన్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటి వరకు ముగ్గురిని అబ్జర్వేషన్‌లో పెట్టినట్లు తెలిపారు. 

Read more