నెలాఖరు దాకా భారత్‌ ‘బంద్‌’

ABN , First Publish Date - 2020-03-23T09:10:47+05:30 IST

దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా.. 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 జిల్లాలు 9 రోజులపాటు లాక్‌డౌన్‌ కానున్నాయి! సబర్బన్‌, మెట్రో సర్వీసులు సహా రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సు

నెలాఖరు దాకా భారత్‌ ‘బంద్‌’

రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, మెట్రో సేవల నిలిపివేత: కేంద్రం

నేటితో పార్లమెంట్‌ బడ్జెట్‌ భేటీ బంద్‌!

మార్చి 31దాకా  విమానాలు రద్దు


న్యూఢిల్లీ/శంషాబాద్‌ రూరల్‌, మార్చి 22: దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా.. 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 జిల్లాలు 9 రోజులపాటు లాక్‌డౌన్‌ కానున్నాయి! సబర్బన్‌, మెట్రో సర్వీసులు సహా రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు.. అన్నీ ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆగిపోయాయి. మార్చి 31 దాకా గూడ్సు రైళ్లు తప్ప మామూలు రైళ్లు పట్టాలెక్కవు, కూత పెట్టవు!! రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలివి. కేంద్రం ప్రకటించిన 80 జిల్లాల్లో తెలంగాణలో ఐదు (భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌), ఏపీలో మూడు (కృష్ణా, ప్రకాశం, విశాఖ) ఉన్నాయి. అవసరాన్ని బట్టి రాష్ట్రప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో ఈ జాబితాను పెంచుకోవచ్చు. మార్చి 31 దాకా ఈ జిల్లాల్లో అత్యవసర సేవలే అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేస్తాయని కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే, కేంద్రం ప్రకటించిన జిల్లాలకు మాత్రమే పరిమితం కాకుండా.. తెలంగాణ, ఏపీ సహా 16 రాష్ట్రాలు పరిస్థితిని బట్టి పూర్తి స్థాయి/ పాక్షిక లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. 


అలాగే.. హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించినా రైళ్లల్లో ప్రయాణిస్తూ దొరికిపోయినవారిలో 12 మంది పాజిటివ్‌గా తేలారు. ఈ నేపథ్యంలో అనవసర ప్రయాణాలకు అడ్డుకట్ట వేసేందుకు.. గూడ్సు రైళ్లు మినహా అన్ని రైళ్లు, మెట్రో సర్వీసులు, సబర్బన్‌ రైళ్లను మార్చి 31 దాకా నిలిపివేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. మార్చి 22 అర్ధరాత్రి నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున నాలుగింటిలోపు బయల్దేరిన రైళ్లను మాత్రం.. గమ్యస్థానం చేరేదాకా అనుమతిస్తారు. రైళ్ల నిలిపివేతతో పాటు..  దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే మ్యూజియమ్‌లు, హెరిటేజ్‌ గ్యాలరీలు, హెరిటేజ్‌ పార్కులను సైతం ఏప్రిల్‌ 15 దాకా మూసివేయాలని నిర్ణయించారు.


రద్దు చేసిన రైళ్లకు సంబంధించి టికెట్ల క్యాన్సిలేషన్‌ గడువును 3 నెలలకు పెంచారు. ఇక కేంద్రం ఆదేశాల మేరకు శంషాబాద్‌ విమానాశ్రయంలో సోమవారం నుంచి అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేశారు. స్వదేశీ విమానాల రాకపోకలు మాత్రం యథాతథంగా సాగనున్నాయి. కాగా.. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు నిర్ణీత షెడ్యూలు కన్నా 12 రోజుల ముందే.. సోమవారం ముగిసిపోయే అవకాశం ఉంది. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 3 దాకా సమావేశాలు కొనసాగాల్సి ఉంది. కానీ, సోమవారం ఉభయసభల్లో ఆర్థిక బిల్లును ఆమోదించి సమావేశాలను ముగించనున్నట్టు తెలుస్తోంది. ఇక..  పారామిలటరీ దళాలు కూడా ఏప్రిల్‌ 5 దాకా ఎక్కడివక్కడే ఉండనున్నాయి. ఇటీవల తాముగానీ, తమ కుటుంబసభ్యులుగానీ విదేశాలకు వెళ్లలేదని జవాన్లందరూ డిక్లరేషన్‌ ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా అలా వెళ్లినట్టు పేర్కొంటే వారిని పరీక్షించి, అవసరమైతే ఐసోలేషన్‌కు తరలించనున్నారు. 

Updated Date - 2020-03-23T09:10:47+05:30 IST