లాక్ ఓపెన్.. నేటి నుంచి యథావిధిగా ప్రభుత్వ కార్యకలాపాలు
ABN , First Publish Date - 2020-05-11T08:13:30+05:30 IST
రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు ఇక యథావిధిగా కొనసాగనున్నాయి. లాక్‌డౌన్ కారణంగా...
- సర్కారు కార్యాలయాలన్నీ ప్రారంభం
- గ్రీన్, ఆరెంజ్ జోన్లలో 100% సిబ్బందితో..
- రెడ్ జోన్లలో 33% సిబ్బందితో పనులు
- ఐటీ కార్యాలయాలూ మొదలు
- మూడో వంతు సిబ్బందికే అనుమతి
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు ఇక యథావిధిగా కొనసాగనున్నాయి. లాక్‌డౌన్ కారణంగా మూతపడిన కార్యాలయాలన్నీ సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. అన్ని జోన్లలోనూ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న కార్యాలయాల్లో వందశాతం ఉద్యోగులు హాజరవనున్నారు. రెడ్‌జోన్లలో 33 శాతం సిబ్బందితో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి. రక్షణ, భద్రతా సర్వీసులు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, పోలీస్, ఎక్సైజ్, కమర్షియల్ టాక్సులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, జైళ్లు, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక, అత్యవసర సేవలు, విపత్తుల నిర్వహణ, అనుబంధ సేవలు, ఎన్‌ఐసీ, కస్టమ్స్, ఎఫ్‌సీఐ, ఎన్‌సీసీ, ఎన్‌వైకే, పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖలు ఎలాంటి ఆంక్షలు లేకుండా పనిచేస్తాయి. మరోవైపు హైదరాబాద్‌లో దాదాపు రెండు నెలల విరామం తర్వాత ఐటీ కారిడార్ కూడా తిరిగి ప్రారంభం కానుంది.
సోమవారం నుంచి ఐటీ కంపెనీలు తెరుచుకోనున్నాయి. పని ప్రదేశంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ, మూడో వంతు సిబ్బందితో కార్యకలాపాలు ప్రారంభించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐటీ సంస్థలకు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో తొలి కరోనా కేసు మార్చి 4న ఐటీ కారిడార్‌లోని మైండ్‌స్పే్‌సలో వెలుగుచూసింది. దాంతో ఐటీ కంపెనీలు ఉద్యోగుల భద్రతపై దృష్టి సారించాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రం హోం) చేయాలని ఉద్యోగులకు సూచించాయి.
తర్వాత మార్చి 22 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఐటీ కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం ఐటీ ఉద్యోగులకు ఏప్రిల్ 30 వరకు ఉన్న వర్క్ ఫ్రం హోం వెసులుబాటును జూలై 31 వరకు పొడిగించింది. గూగుల్ లాంటి కంపెనీలు మరో ఆరు నెలల వరకు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని, ఇంటి నుంచి విధులు నిర్వహించవచ్చని ఉద్యోగులకు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీల కార్యాలయాలు ఆగస్టు మొదటి వారం నుంచి తెరుచుకుంటాయని అందరూ భావించారు.
కానీ, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఐటీ రంగం కార్యకలాపాలకూ అనుమతి ఇచ్చింది. మొత్తం సిబ్బందిలో మూడో వంతు మంది కార్యాలయాలకు రావచ్చని, ఈ నెల 11 నుంచి కార్యకలాపాలు ప్రారంభించవచ్చని ఐటీ శాఖ కంపెనీలకు తెలియజేసింది. పని ప్రదేశంలో పాటించాల్సిన నిబంధనల గురించి కూడా ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. కంపెనీల యాజమాన్యాలు వీటిని తప్పనిసరిగా పాటించాలని ఐటీ కారిడార్ నోడల్ అధికారి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారమే చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ నెలాఖరు వరకూ వర్క్ ఫ్రం హోం వెసులుబాటు ఇచ్చాయని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. కొన్ని కంపెనీలు మాత్రం సోమవారం నుంచి కార్యాలయాల ద్వారా విధులు ప్రారంభించనున్నాయని తెలిపారు. 20 శాతం కంపెనీలు తెరుచుకుంటాయని, ఇందులో 33ు సిబ్బందికి అనుమతి ఇస్తున్నామని ఆయన వివరించారు. జూన్ 1 నుంచి ఎక్కువ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభిస్తాయన్నారు.
ఐటీ కారిడార్‌లో రోడ్ల నిర్మాణ పనులు..
ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో ప్రస్తుతం రోడ్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. సోమవారం నుంచి ఐటీ ఉద్యోగులు రానుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం దగ్గర, బయోడైవర్సిటీ, రాయదుర్గం, షేక్‌పేట ప్రాంతాల్లోనూ రోడ్లు వేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఐటీ సంస్థలకు మార్గదర్శకాలివే..
- ప్రతి సంస్థ మూడు షిఫ్టుల్లో పనిచేయాలి. అత్యవసర సిబ్బందితో కలుపుకొని 33ు ఉద్యోగులు మాత్రమే హాజరయ్యేలా చూడాలి.
- అందరూ ఒకేసారి రాకుండా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకూ లాగిన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకూ లాగ్‌ఔట్‌కు సమయాన్ని కేటాయించాలి.
- ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఐడీకార్డు ధరించాలి. ఆఫీసు వారు ఇచ్చే వాహనాలను కేవలం ఇంటి నుంచి వచ్చేందుకు, తిరిగి ఇంటికి వెళ్లేందుకు మాత్రమే వినియోగించుకోవాలి.
- రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకూ కచ్చితంగా కర్ఫ్యూ నిబంధనలు పాటించాలి.
- మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగం, హ్యాండ్‌వాష్, భౌతిక దూరం లాంటివి తప్పనిసరిగా పాటించాలి.
- సంస్థ ఏర్పాటు చేసే క్యాబుల్లో డ్రైవర్ కాకుండా ఇద్దరు, బస్సుల్లో 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
- ఆయా సంస్థల ఉద్యోగులు రోడ్లపై గుంపులుగా తిరిగినట్లు గమనిస్తే కఠిన చర్యలుంటాయి.
- తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ సంస్థల్లో క్యాంటీన్ల నిర్వహణకు అనుమతి లేదు.