అక్కడ వాహనాలు రోడ్డెక్కవు

ABN , First Publish Date - 2020-04-07T09:00:25+05:30 IST

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు బెంగళూరు నగరంలో పకడ్బందీగా అమలవుతున్నాయి. పోలీసులు కట్టుదిట్టంగా, కఠినంగా వ్యవహరిస్తుండటతో అక్కడ ఎక్కువ సంఖ్యలో వాహనాలు రోడ్డు

అక్కడ వాహనాలు రోడ్డెక్కవు

  • నిత్యావసరాలకు 3 కిమీ లోపు కాలినడకనే.. 
  • వాహనం కనబడితే సీజ్‌.. 
  • అత్యవసర విభాగాలకు మినహాయింపు
  • బెంగళూరులో పకడ్బందీగా లాక్‌డౌన్‌  
  • హైదరాబాద్‌లో యథేచ్ఛగా వాహనాలు
  • నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రజలు
  • ఇలాగే ఉంటే.. లాక్‌డౌన్‌ పొడిగింపే?


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు బెంగళూరు నగరంలో పకడ్బందీగా అమలవుతున్నాయి. పోలీసులు కట్టుదిట్టంగా, కఠినంగా వ్యవహరిస్తుండటతో అక్కడ ఎక్కువ సంఖ్యలో వాహనాలు రోడ్డు మీదకు రాకుండా అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. నిత్యావసరాలు సరఫరా చేసే వాహనాలు మినహా మరే ఇతర వాహనాలు రోడ్లపై కనిపించడంలేదు. నిత్యవసరాలకోసం చుట్టుపక్కల (1-3 కి.మీ లోపు) ఉన్న దుకాణాలకు కేవలం కాలినడ కన మాత్రమే వెళ్లాలి. అత్యవసరమైతే తప్ప వాహనం బయటకు తీయకూడదు, రోడ్డెక్కకూడదు. అత్యవసరమైతే ప్రభుత్వ అధికారులు, పోలీసులకు ఫోన్‌ చేసి సేవలను వినియోగించుకోవాలి. ఒకవేళ ఆ సేవలు అందుబాటులో లేనప్పుడు మాత్రమే సొంత వాహనాలు బయటకు తీయాలి. కాదని నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు, వాహనాలు సీజ్‌ చేస్తారు. సరైన కారణం లేకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేట్‌ వాహనాలను బెంగళూరులో అనుమతించడంలేదు.


హైదరాబాద్‌లో ఇలా..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో లాక్‌డౌన్‌ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అత్యవసరం లేకున్నా వాహనాలపై రోడ్ల మీదకు వస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో ద్విచక్ర వాహనంపై ముగ్గురు నలుగురు వెళ్తూ పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. అత్యవసరమైతే 1-3 కిలోమీటర్ల వరకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలని విధించిన నిబంధనలను కాదని.. ఇష్టమొచ్చినట్లు వాహనాలపై ప్రయాణిస్తున్నారు. ఏదో ఒక సాకు చెప్పి స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. భౌతిక దూరాన్ని కూడా పాటించడంలేదు. కరోనా కట్టడికి మరికొంతకాలం లాక్‌డౌన్‌ పొడిగించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నగర ప్రజలు ఇదే పద్ధతి అవలంబిస్తే కరోనా కట్టడి మాట దేవుడెరుగు.. ఇంట్లో వాళ్లకు సైతం కరోనా సోకే ప్రమాదం ఉందని, మరిన్ని కష్టాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా నిబంధనలు పాటిస్తే అందరికి మంచిదని గుర్తుంచుకొని బాధ్యతగా ఉండాలని సూచిస్తున్నారు. 


2లక్షలకు పైగా కేసులు..

హైదరాబాద్‌లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు కేసలు నమోదు చేసి, చలానాలు విధిస్తున్నారు.  వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ విధించిన ఈ 10 రోజుల్లోనే 2లక్షలకు పైగా ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. వందల సంఖ్యలో వాహనాలు సీజ్‌ చేశారంటే నిబంధనలను ఎంతగా ఉల్లంఘిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Read more