నెలాఖరు వరకూ..
ABN , First Publish Date - 2020-04-12T08:45:22+05:30 IST
తెలంగాణలో ఈ నెల 30వ తేదీ దాకా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సొంత క్షేమం కోసం, పిల్లల భవిష్యత్ కోసం గతంలో లాగే ఇక ముందు కూడా సహకరించాలని ప్రజలకు

లాక్‌డౌన్ మరో 16 రోజులు పొడిగింపు
తర్వాత దశల వారీగా ఎత్తివేస్తాం
కొత్త ఉప్పెన రాకుంటే బయటపడ్డట్లే
1-9 తరగతుల విద్యార్థులంతా పాస్
పది పరీక్షలపై నిర్ణయం తీసుకుంటాం
రాష్ట్రాల రుణ పరిమితిని పెంచాలి
క్వాంటిటేటివ్ ఈజింగ్ అమల్జేయండి
రాష్ట్రంలో 243 కంటైన్‌మెంట్ జోన్లు
విలేకరుల సమావేశంలో కేసీఆర్
అప్పుల పరిమితి 5% కావాలి
వాయిదాలు ఆర్నెల్లు ఆపాలి
ప్రధానితో వీసీలో సీఎం కేసీఆర్
రైతుల మధ్య పండుగ జరుపు కోవాలనుకున్నా..
తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 40 లక్షల ఎకరాలలో వరి పంట వస్తోంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్. నాకు 20, 30 మార్కెట్లలోకి వెళ్లి రైతుల మధ్య పండుగ జరుపుకోవాలని ఉండే. కరోనా కారణంగా రైతుల మధ్యకు పోలేకపోయాం.
భగవంతుడిని నిండు మనసుతో ప్రార్థిస్తున్నా. మేమేం తప్పు చేశామో గానీ.. మాకీ శిక్ష చాలిక. ఏప్రిల్ 30 నుంచి మా దేశం నుంచి ఈ మహమ్మారిని తరిమేస్తే మేము పని చేసుకుని బతుకుతాం. ఆ వెసులుబాటు కల్పించాలని భగవంతుడిని నిండు మనసుతో ప్రార్థిస్తున్నా’’
- సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఈ నెల 30వ తేదీ దాకా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సొంత క్షేమం కోసం, పిల్లల భవిష్యత్ కోసం గతంలో లాగే ఇక ముందు కూడా సహకరించాలని ప్రజలకు విజ్ఙప్తి చేశారు. ‘‘సామూహిక కార్యకలాపాలు మానుకోవాలి. మీరు నష్టపోయి, సంఘానికి నష్టం చేయొద్దు. ఏప్రిల్ 30వరకు ఓపిక పడితే ఆ తర్వాత దశలవారీగా ఎత్తివేస్తాం’’ అని హామీ ఇచ్చారు. శనివారం రాత్రి కేబినెట్ సమావేశం అనంతరం ఆయన విలే కర్లతో మాట్లాడారు. కరోనా సోకిన 34 మంది విదేశీయులు, వారి ద్వారా వైరస్ సంక్రమించిన వారంతా డిశ్చార్జి అయ్యారని సీఎం వెల్లడించారు. తొలిదశలో 25,937 మందిని వివిధ చోట్ల క్వారంటైన్‌లో ఉంచామని, వారంతా డిశ్చార్జి అయ్యారని తెలిపారు. పాతవి, కొత్తవి కలుపుకొని రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 503 ఉన్నాయని, 14మంది చనిపోయారని చెప్పారు. 96 మందికి నయమై, ఇంటికి వెళ్లిపోయారని తెలిపారు. ప్రస్తుతం 393 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా ఆస్పత్రిలోనే ఉన్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని, వెంటిలేటర్ మీద పెట్టలేదని, కనీసం ఎవరూ ఐసీయూలో కూడా లేరని చెప్పారు. మర్కజ్ నిజాముద్దీన్ సభ తర్వాత అక్కడికి వెళ్లి వచ్చిన 1200 మందిని, వారి బంధువులను పరీక్షించామని, క్వారంటైన్‌లో 1654 మంది ఉన్నారని చెప్పారు. రోజుకు మూడు నాలుగు మించి కేసులు రావడం లేదని, ఇప్పుడు హాట్ జోన్ల నుంచి కరోనావైరస్ వ్యాప్తి లేకుండా చూసేందుకు కంటెయిన్‌మెంట్ మీద దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ‘‘రాష్ట్రంలో 243 చోట్ల కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. నగరంలో 123, జిలాల్లో 120 జిల్లాల్లో ఉన్నాయి. అక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ దశ నుంచి సంక్రమణ తగ్గితే ఏప్రిల్ 24 కల్లా ఈ బ్యాచ్ అంతా డిశ్చార్జి అవుతారు. కొత్త ఉప్పెన రాకపోతే బయటపడతాం’’ అన్నారు.
9దాకా అంతా పాస్
‘‘ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. పదో తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలో 1-9వ తరగతి దాకా విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నాం. అందరినీ ప్రమోట్ చేస్తున్నాం’’ అని సీఎం ప్రకటించారు.
15 దాకా ప్రాజెక్టుల నీళ్లు
అన్ని ప్రాజెక్టుల కింద ఏప్రిల్ 15వ తేదీ దాకా నీళ్లు వదులుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పంటల కోతలు జరుగుతున్నాయి కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూలీలకు వర్తింపజేయాలని కోరారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌కూ వెసులుబాటు ఇవ్వాలి
పీఎం కేర్ నిధికి వర్తించే నిబంధనలను ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు వర్తింపజేయాలని కేసీఆర్ ప్రధానిని కోరారు. ముఖ్యంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత, ఇతర పన్ను మినహాయింపు నిబంధనలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు వర్తింపజేయాలన్నారు. అప్పుడే తమ ఫండ్‌కు విరాళాలు పెరుగుతాయన్నారు.
పప్పు శనగలను మద్దతు ధరకే కొంటాం
పప్పు శనగలకు రూ.800 కోట్లు కేటాయించామని, వీటిని కనీస మద్దతు ధరకు కొంటామని సీఎం ప్రకటించారు. 55 లక్షల ఎకరాల్లో రబీ పంటను రైతాంగం కోయడం చరిత్రలో ఇది తొట్టతొలిసారి అన్నారు. రైతుల మధ్య ఈ పండగ చేసుకుందామనుకున్నప్పటికీ కరోనా వల్ల విరమించుకున్నట్లు తెలిపారు. ఇతర రంగాలను నిషేధించినా వ్యవసాయ రంగాన్ని మాత్రం అనుమతిస్తారని సీఎం చెప్పారు. ‘‘ధాన్యాన్ని ప్రాసెస్ చేసే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి అనుమతివ్వాల్సిందే. రైసు మిల్లులు, గోధుమలను పట్టే ఫ్లోర్ మిల్స్, ఆయిల్ సీడ్స్‌ను నూనెలుగా మార్చే మిల్లులకు అనుమతులుంటాయి’’ అని తెలిపారు.
కఠినత్వం మాత్రం అంతే ఉంటుంది
లాక్‌డౌన్ కఠినత్వం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సింగపూర్‌లో లాక్‌డౌన్‌ను ఎత్తేసి దెబ్బ తిన్నారని, మళ్లీ ఇప్పుడు నెల రోజులు పెట్టుకున్నారని ప్రస్తావించారు. ‘‘ఇది విచిత్రమైన వ్యాధి. ఒక వ్యక్తి తనకు వచ్చిందని తెలిస్తే ఎవరికీ పూయరు.అందుకే కంటైన్‌మెంట్ పద్ధతిలో ఎక్కడున్న వారిని అక్కడే ఉంచితే ఇతరులకు ప్రబలదు’’ అన్నారు.
క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే?
ఆర్థిక సంక్షోభం నుంచి దేశం గట్టెక్కేందుకు ముఖ్యమంత్రుల సదస్సులో సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘‘క్వాంటిటేటివ్‌ఈజింగ్’’(క్యూఈ) సలహా ఇప్పుడు చర్చనీయాంశమైంది. 1918లో, 2008లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడినపుడు అమెరికా సర్కారు కూడా ఈ మార్గాన్నే అనుసరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంల సదస్సులో గుర్తు చేశారు. జీడీపీలో 5 శాతం మేర రిజర్వు బ్యాంకు ఆయా రాష్ట్రాల నుంచి బాండ్లు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే... మార్కెట్లో డబ్బులు అయిపోయిన సమయంలో వాణిజ్య లావాదేవీలు మందగించకుండా చూసేందుకు రిజర్వు బ్యాంకు తనే రంగంలోకి దిగి, ప్రభుత్వాలు, బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి లాంగ్ టర్మ్ సెక్యూరిటీలను కొంటుంది. దాంతో వాటికి తక్కువ వడ్డీకి నిధులు దొరుకుతాయి. ఈ మొత్తంతో వాణిజ్య కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కలుగుతుంది.
విమానాలు, రైళ్లు నడపం
రైళ్లు, విమానాలు నడపకూడదని సీఎంల సమావేశంలో నిర్ణయించారని కేసీఆర్ చెప్పారు. అత్యంత శక్తివంతమైన అమెరికా ఇప్పుడు కరోనాతో సతమతమౌతోందని, రోజుకు రెండు వేల మంది చనిపోతున్నారని, పదివేల మంది చావు బతుకుల్లో ఉన్నారని ప్రస్తావించారు. అమెరికాలో నాలుగు లక్షల మందికి కరోనా వస్తే భారతదేశంలో ఏడు వేల మందికే వచ్చిందని, కేవలం 300 మంది మరణించారని ప్రస్తావించారు. భారత్ మంచి కంట్రోల్‌లో ఉందన్నారు.
కల్తీ చేస్తే ప్రభుత్వ ఆగ్రహం తప్పదు
‘‘తినుబండారాలు, నూనెలను ఎవరైనా కల్తీ చేస్తే... వందకు వంద శాతం వారు ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతారు. పీడీ యాక్టు పెట్టి రెండు మూడేళ్ల వరకు లోపలేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో దుర్మార్గం చేసి, దొంగతనంగా డబ్బు సంపాదిస్తామంటే కరెక్ట్ కాదు. కఠినంగా వ్యవహరిస్తాం. చౌక ధరల దుకాణాల వద్ద చివరి వ్యక్తి వరకు డబ్బులు, రేషన్ ఇస్తాం’’ అన్నారు. రాళ్ళ వానతో నష్టపోయినవారిని ఆదుకుంటామన్నారు.
‘మహా’ సరిహద్దులను మూస్తాం
‘‘ప్రభుత్వం వద్ద రోజుకు 1000 పరీక్షలు చేసే శక్తి ఉంది. అది దాటితే ప్రైవేటు కేంద్రాలకు ఇద్దామనుకున్నాం. అయితే, వాళ్లు చికిత్స చేసే పరిస్థితి లేదు. నిజాముద్దీన్ ఘటన లేకపోతే దైర్యంగా ఉండేవాళ్లం. మహారాష్ట్రలో ఈ రోజు 11 మంది చనిపోయారు. అందుకే మహారాష్ట్ర సరిహద్దులను మూసేయాలని అనుకుంటున్నాం. ఎవరి రాష్ట్రాన్ని వారు కాపాడుకోవాలి కదా’’ అన్నారు.
హెలికాప్టర్ మనీ ప్లీజ్
‘‘ఇప్పటి సంక్షోభం గతంలో ముందెన్నడూ ఎరగనిది. 1918లో యూర్‌పలో స్పానిష్ ఫ్లూ వచ్చింది. 2008లో ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈ రెండు సందర్భాల్లో ప్రపంచం క్వాంటిటేటివ్ ఈజింగ్ పద్ధతిని అనుసరించింది. ఇప్పుడు మన దేశం, రాష్ట్రాల్లోనూ ఆదాయం పడిపోయింది. సంక్షోభాన్ని నివారించాలంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ ఒకటే మార్గం’’ అన్నారు. ఇందులో భాగంగా దేశం జీడీపీలో కొంత శాతం మొత్తాన్ని ప్రజల్లోకి విడుదల చేయాలని చెప్పారు. ‘‘కరోనా వాచ్చాకే అమెరికన్ ఫెడరల్ బ్యాంకు 10 శాతం(2 ట్రిలియన్ డాలర్లు), బ్రిటీష్ బ్యాంక్ ఆఫ్ లండన్(15ు) మార్కెట్‌లో డబ్బు పంపించాయి. మనకు ఇప్పుడు పన్ను వసూళ్ల ఆశల్లేవు. ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకోవడం ఒక్కటే మార్గం’’ అన్నారు. 2019-20లో భారత్ రూ.203 లక్షల కోట్లు జీడీపీ ఉంది. ఇందులో 5ు ఇచ్చినా రూ.10 లక్షల కోట్లు దేశంలో ప్రజలకు ఇవ్వాలి. దాన్ని వివిధ రూపాల్లో సమాజానికి చేర్చాలి. చేపలు, కూరగాయల దుకాణాలు, పాల దుకాణాలకు ఇవ్వాలి.. మాకు సహకరించాలని వారు కోరుతున్నారు. పారిశ్రామిక వర్కర్లు కూడా కావాలని అడుగుతున్నారు. సమాజంలోకి డబ్బును పంప్ చేస్తే ఆర్థిక పరిస్థితి బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇలా పునరుద్ధరించడాన్ని హెలికాప్టర్ మనీ అంటారు. సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు.