లాక్‌డౌన్‌ కొనసాగాలి

ABN , First Publish Date - 2020-04-07T09:05:19+05:30 IST

లాక్‌డౌన్‌ వల్లే దేశం చాలా సురక్షితంగా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా సోమవారం నాటికి 4,314 కరోనా కేసులు నమోదైతే అందులో మరణించిన వారు 122 మంది మాత్రమేనని చెప్పారు.

లాక్‌డౌన్‌ కొనసాగాలి

  • వేరే గతి, మార్గం లేదు.. అప్పుడే నియంత్రణలోకి కరోనా
  • లేకపోతే ప్రస్తుత లాక్‌డౌన్‌ వృథా.. మోదీ అడిగితే ఇదే చెప్పా
  • కనీసం ఒకటి, రెండు వారాలు పొడిగించాలి: సీఎం కేసీఆర్‌
  • బతికుంటే బలుసాకు తినొచ్చు.. ఆర్థిక వ్యవస్థను బతికించుకోవచ్చు
  • ప్రాణాలను తీసుకురాలేము కదా.. మనం చాలా సురక్షితంగా ఉన్నాం
  • అమెరికాలో అంతా శవాల గుట్టలే.. రాష్ట్రంలో చనిపోయింది 11 మంది
  • వీరంతా ఢిల్లీకి వెళ్లి వచ్చినవారే.. కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది
  • 2400 కోట్లకు వచ్చింది 6 కోట్లే.. ఎంపీల జీతాల కోతకు మద్దతిస్తాం
  • గోనె సంచుల కొరతను అధిగమిస్తాం.. ఇక్కడే జూట్‌ మిల్లులు పెడతాం


‘‘చాలా మంది మాట్లాడుతున్న దాని ప్రకారం ఇండియాకు లాక్‌డౌన్‌ ఎంత కఠినంగా పాటిస్తే అంత మంచిది. ఇంకా కూడా లాక్‌డౌన్‌ ఉండాల్సిందేననీ అంటున్నారు. దేశంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ కొనసాగించాలని నరేంద్ర మోదీ అడిగితే చెప్పా. వేరే గతి, మార్గం లేదు. బతికుంటే బలుసాకు తినొచ్చు. ఆర్థిక వ్యవస్థను ఎలాగైన బతికించుకోవచ్చు. కానీ ప్రాణాలను తీసుకురాలేం కదా. 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ వల్లే దేశం చాలా సురక్షితంగా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా సోమవారం నాటికి 4,314 కరోనా కేసులు నమోదైతే అందులో మరణించిన వారు 122 మంది మాత్రమేనని చెప్పారు. జనాభా దామాషా చూసుకుంటే దేశం చాలా సేఫ్‌గా పోతోందని చెప్పవచ్చన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తీరుపై సోమవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ లేకుంటే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనేవాళ్లమని అన్నారు. అమెరికా వంటి బలమైన దేశమే భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటోందని, న్యూయార్కులో శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని చెప్పారు. ఆ దామాషానే మనకు వచ్చి ఉంటే కోట్ల మంది చనిపోయి ఉండేవారని, ఎటూ కాకుండా అయిపోయేవాళ్లమని అన్నారు. 


విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన వారు, వారికి సన్నిహితంగా మెలిగిన 25,937 మందిని మొదటి దశలో క్వారంటైన్‌ చేయగా, వారిలో 50 మందికి కరోనా పాజిటివ్‌ తేలిందని చెప్పారు. ఇందులో విదేశాల నుంచి వచ్చిన వాళ్లు 30 మంది, మిగిలిన 20మంది వారి కుటుంబ సభ్యులని తెలిపారు. అదృష్టంకొద్దీ వారిలో ఒక్కరు కూడా చనిపోలేదని, వారు తొందరగా చికిత్సకు రావడంతో కంట్రోల్‌ చేయగలిగామన్నారు. వీరిలో 35 మంది డిశ్చార్జి అయ్యారని, మిగిలిన 15 మంది బుధవారానికల్లా డిశ్చార్జి అవుతారని చెప్పారు. ‘‘విదేశాల నుంచి తిరిగొచ్చిన వారిలో ప్రస్తుతం 258 మందే క్వారెంటైన్‌లో ఉన్నారు. వారికి నెగెటివ్‌ వచ్చింది. మంగళవారం సాయంత్రం డిశ్చార్జి చేస్తాం. బుధవారానికల్లా పాత బ్యాచ్‌ క్లియర్‌ అవుతుంది’’ అని వివరించారు. పాతవి 50, నిజాముద్దీన్‌ లింకు ఉన్న కేసులు కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 364 మందికి కరోనా సోకిందని చెప్పారు. ఇండోనేషియాకు చెందిన పది మంది కూడా నిజాముద్దీన్‌కు సంబంధించిన వారేనని, వారికీ నయమైందన్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 11 మంది చనిపోయారని, వీరంతా నిజాముద్దీన్‌ వెళ్చొచ్చిన వారేనన్నారు.


అక్కడితో ఆగిపోతుందనే భావిస్తున్నా

‘‘నిజాముద్దీన్‌కు వెళ్లి రాష్ట్రానికి తిరిగొచ్చిన 1,089 మందిని గుర్తించి పట్టుకున్నాం. మరో 30 నుంచి 35 మంది వరకూ ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోందని, వారిని ఢిల్లీ ప్రభుత్వమే క్వారంటైన్‌ చేసి ఉంటుంది. రాష్ట్రానికి వచ్చిన వారిలో 172 మందికి వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. చనిపోయిన 11 మంది కూడా ఇందులోనే ఉన్నారు. ఈ 172 మంది ద్వారా వారి కుటుంబ సభ్యుల్లో 93 మందికి వైరస్‌ సోకింది’’ అని కేసీఆర్‌ చెప్పారు. ‘‘నిజాముద్దీన్‌ నుంచి వారు సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రె్‌సలో ప్రయాణించారు. వారితో ప్రయాణించిన వారిని కలిపి 3,015 మంది వివరాలు సేకరించాం. ఇందులో హిందూ సోదరులు కూడా ఉన్నారు. వెయ్యి మందికి కరోనా నెగెటివ్‌ వచ్చింది. మరో రెండున్నర మూడు రోజుల్లో టెస్టులు పూర్తవుతాయి. చికిత్స పొందుతున్న 308 మందికి మరో 110 మంది వరకు జత చేరే ఆస్కారం ఉంది. అక్కడితో అది ఆగిపోతుందనే భావిస్తున్నాను’’ అన్నారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో తక్కువ వైరస్‌ లోడ్‌ అయినవాళ్లు బతుకుతున్నారని, ఎక్కువున్నవారు మరణిస్తున్నారని చెప్పారు.


ఆమె కుటుంబాన్ని ఆదుకుంటాం

సికింద్రాబాద్‌లో కూలీ పనిచేస్తూ జ్వరం వచ్చి చనిపోయిన రాధ అనే మహిళ కుటుంబాన్ని ఆదుకుంటామని కేసీఆర్‌ చెప్పారు. ‘‘ఆమె నలుగురు పిల్లలు అనాథలయ్యారని ఒక పత్రికలో చదివా. చదువుతుంటే కళ్లలోకి నీళ్లొచ్చే పరిస్థితి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులను ఆదేశించాం. కరోనా మరణాల వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయో ఉహించుకుంటేనే దుఃఖం వస్తుంది’’ అని అన్నారు.


ఆ తల్లులకు పాదపూజ చేస్తా

రూ.20 వేలతో సరుకులు కొని పంచిపెట్టిన బీడీ కార్మికురాలి ఔదార్యాన్ని కేసీఆర్‌ కొనియాడారు. ‘‘మేడ్చల్‌లో మరో మహిళ తనకు వచ్చిన 20 కిలోల బియ్యాన్ని పంచిపెట్టింది. ఇలా గొప్పగా ఆలోచించే తల్లులకు పాదపూజ చేస్తా. అవార్డులు కూడా ఇస్తాం. కష్టకాలంలో సమాజానికి మానసిక స్థైర్యం కల్పించే వాళ్లు కావాలి’’ అని అన్నారు.


దీపం వెలిగించమంటే జోకులా?

అందరూ దీపాలు వెలిగించాలన్న ప్రధాని మోదీ పిలుపుపై సోషల్‌ మీడియాలో అవహేళన చేయడంపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా రోజురోజుకు యాంటీ సోషల్‌గా మారుతోందని అన్నారు.


అదనంగా 25 వేల మంది సిబ్బంది

అదనంగా 25 వేల మంది వైద్య సిబ్బందితో పూల్‌ను తయారుచేశామని కేసీఆర్‌ తెలిపారు. ‘‘వారందరి ఫోన్‌ నంబర్లు, అడ్ర్‌సలు తీసుకున్నాం. 16-18 వేల బెడ్లు సిద్ధం చేశాం’’అని చెప్పారు. 


వైద్య సిబ్బందికి పాదాభివందనం

ప్రాణాలకు తెగించి అద్భుతంగా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిని కేసీఆర్‌ కొనియాడారు. ‘‘వారికి చేతులు జోడించి దండం పెడుతున్నా. ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న వారి నుంచి హెల్త్‌ డైరెక్టర్‌ వరకు అందరికీ పాదాభివందనం చేస్తున్నా. వాళ్లను ఎంత పొగిడినా తక్కువే’’ అని  అన్నారు.

Read more