లాక్‌డౌన్ కొనసాగించాలని చెప్పా
ABN , First Publish Date - 2020-04-07T09:07:32+05:30 IST
లాక్‌డౌన్‌లో ప్రజలు గొప్పగా సహకరించారని కేసీఆర్ అన్నారు. దేశం, రాష్ట్రం మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల కరోనా కేసులు నాలుగు వేల దగ్గరే ఆగిపోయాయని చెప్పారు. సమాజాన్ని మనం బతికించుకున్నామంటే కారణం

హైదరాబాద్: లాక్‌డౌన్‌లో ప్రజలు గొప్పగా సహకరించారని కేసీఆర్ అన్నారు. దేశం, రాష్ట్రం మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల కరోనా కేసులు నాలుగు వేల దగ్గరే ఆగిపోయాయని చెప్పారు. సమాజాన్ని మనం బతికించుకున్నామంటే కారణం లాక్‌డౌనేనన్నారు. అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనే సంస్థ భారత్‌లో జూన్ 3 వరకూ లాక్‌డౌన్ కొనసాగించాలని సూచించిందని చెప్పారు. దేశానికి లాక్‌డౌన్ పాటించడం మినహా వేరే మార్గం లేదని, అయితే దీనిపైనా వితండ వాదాలూ ఉన్నాయన్నారు. ఆర్థిక రంగం దెబ్బతింటున్న మాట నిజమేనన్న సీఎం.. తెలంగాణకు రోజుకు రూ.400-440 కోట్ల వరకూ ఆదాయం రావాల్సి ఉంటుందని చెప్పారు. ఏప్రిల్ ఆరు రోజుల్లో రూ.2400 కోట్ల మేరకు ఆదాయం రావాల్సి ఉండగా రూ.6 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పారు. దేశం గతీ ఇలానే ఉందన్నారు. అయితే చచ్చుడు, బతుకుడు చూసుకుంటే మాత్రం సంతోషంగానే ఉందన్నారు. అమెరికా, స్పెయిన్, ఇటలీలో ఉన్నట్లు చావులు, శవాల గుట్టలు మాత్రం లేవన్నారు. బతికుంటే బలుసాకు కూర తినొచ్చునని, ఎకానమీని కష్టపడి పునరుద్ధరించచుకోవచ్చని చెప్పారు. ‘‘దేశంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ కొనసాగించాలని ప్రధాని అడిగితే చెప్పా. వేరే మార్గం లేదు. ప్రాణాలు పోతే తీసుకురాలేం కదా. సతీసావిత్రి పురాణం ఒక్కటి తప్ప చనిపోయిన వాళ్లను తిరిగి తెచ్చినట్లు ఎక్కడా లేదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే ఎవర్ని వదలాలి? ఎవర్ని వదలొద్దు? ఎత్తివేశామన్న తర్వాత ఎవరైనా ఆగుతరా? గుళ్లు, మసీదులు, కార్యక్రమాలు, బార్లు, ఖార్ఖానాలు మొత్తం గుమిగూడడం ప్రారంభమైతయి. ఎటుబోతం? ఏమైతం? లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం అంత ఈజీ కాదు. చాలా ఆలోచించాల్సి వస్తోంది’’ అని తెలిపారు. ‘‘మనిషి జీవితంలోనే ఇలాంటి సంఘటన లేదు. ఈ బీమారీకి వ్యాక్సిన్ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో బయటికి రానిస్తలేరన్న భావనా సరికాదు’’ అన్నారు.